జగన్ సర్కారు పన్ను పోటుపై బాబు రీట్వీట్ చేసిన వాయిస్ రికార్డులో ఏముంది?

Update: 2022-04-28 06:32 GMT
ప్రభుత్వం తమకొచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు పన్ను బాదుడ్ని పెంచుసుకుపోవటం తెలిసిందే. అంతకంతకూ పెరుగుతున్న సంక్షేమ బిల్లును సర్దుబాటు చేసుకోవాలంటే అయితే ఆస్తుల్ని అమ్మటం.. లేదంటే అప్పులు తేవటం.. ఇంకా సర్దుబాటు కాలేదంటే పన్ను మోత మోగించి.. భారీగా ఆదాయాన్ని మూటకట్టుకొని.. తాము అనుకున్న తాయిలాల్ని పంచే ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. ఏపీలోని జగన్ సర్కారు ఇందుకు మినహాయింపు కాదు.

ఇటీవల కాలంలో ఏపీలోని పుర.. నగరపాలక సంస్థల్లోనూ.. నగర పంచాయితీల్లో భారీగా పెంచిన ఆస్తిపన్నుపై సామాన్యులు మొదలు ఎగువ మధ్యతరగతి వారి వరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కొన్ని  గొంతుకలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా అలాంటి గొంతుక ఒకటి వాయిస్ రికార్డు రూపంలో వైరల్ అవుతోంది. వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

పన్నుపోటుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని తాను నేరుగా చెప్పటం కంటే.. ప్రజా సమూహంలోని ఒకరి వాయిస్ రికార్డు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు ఏపీ విపక్ష నేత చంద్రబాబు. తాజాగా విజయవాడకు చెందిన ఒక వ్యక్తి పెరిగిన పన్నుపోటుపై తనకున్న సందేహాల్ని.. ఆగ్రహాన్ని సంధిస్తూ ఒక వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాన్ని చంద్రబాబు రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ వాయిస్ రికార్డుకు ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వాన్ని సూటిగా సంధించిన ప్రశ్నలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. వైరల్ గా మారిన ఈ వాయిస్ రికార్డులో ఏముందన్న విషయానికి వస్తే.."అందరికి నమస్కారం.

మధ్యతరగతి వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే.. రూ.వంద పన్ను కడతావా? రూ.5 రాయితీ ఇచ్చి రూ.95 కడతావా? అంటే.. తిన్నా తినకున్నా ఇతర అవసరాలు ఉన్నా.. వాటిని వదిలేసి రూ.95 పన్ను కట్టటానికే మొగ్గు చూపుతారు. విషయం ఏమంటే.. ఈ నెలాఖరు లోపు ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని విజయవాడ నగరపాలక సంస్థ ప్రకటన చేసింది. ఒక మధ్యతరగతికిచెందిన వ్యక్తిగా.. డిమాండ్ నోటీసు ఇవ్వకున్నా.. నగర పాలక సంస్థ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆ నోటీసు డౌన్ లోడ్ చేశాను. అందులో రూ.5700 చెల్లించాలని ఉంది" అని పేర్కొన్నారు.

తన వాదనను వినిపిస్తూ సదరు వ్యక్తి.. "గత ఏడాది నేను ఇదే పన్ను రూ.3600 కట్టాను. ఏడాదిలో ఇంత ఎందుకు పెరిగిందని అదే వెబ్ సైట్ లో ఉన్న డీసీబీ రిపోర్టును చూశాను. అందులో 7 హెడ్డు కనిపించాయి. మొదటిది సాధారణ పన్ను. రెండోది చెత్త పన్ను. మా ఇంటి ముందే పెద్ద చెత్తకుప్ప ఉంది. అంతా వచ్చి చెత్త వేస్తుంటారు. ఇందుకు చెత్తపన్ను వేశారా? శుభ్రం చేసి కదా చెత్తపన్ను వసూలు చేయాలి. మూడోది డ్రైనేజీ పన్ను. ఇంటి ముందు చిన్నకాలువ నిండా చెత్తే ఉంటుంది. దోమల బెడద ఉంది. దోమల కారణంగా నా భార్యకు డెంగీ వస్తే వారం రోజులు ఆసుపత్రిలో వైద్యం చేయించా. నాలుగోదు లైటింగ్ టాక్స్.. ఐదోది నీటి పన్ను. ఆరోది అనుమతి లేదంటూ రూ.1400 పెనాల్టీ వేశారు. ప్లాన్ ఉన్నా పెనాల్టీ ఎందుకు వేస్తున్నారు? రూ.250 లైబ్రరీ సెస్సు వేశారు. మా ఇంటికి దగ్గర్లో మద్యం దుకాణాలు ఉన్నాయి తప్పించి లైబ్రరీలు కనిపించలేదు. టాక్స్ ఏరియర్స్ కింద రూ.570 వేశారు. దాని మీద వడ్డీ రూ.11.. మొత్తం కలిపితే రూ.5700 లతో డిమాండ్ నోటీసు జనరేట్ చేశారు" అని పేర్కొన్నారు.

పన్నుల్ని సకాలంలో చెల్లించాక మళ్లీ బకాయిల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అన్న సందేహంతో సచివాలయం ఉద్యోగిని అడిగితే పన్నులు పెరిగాయని చెప్పారు. మరి.. మీ జీతాలు పెరిగాయా? అని అంటే లేదన్నాడు. ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగలేదు.. పన్ను మాత్రం పెరిగింది. దీనికి కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా? 50 శాతం పన్ను ఎందుకు పెరిగింది? సరే.. ప్రభుత్వం చెప్పినట్లు ఇప్పుడు రూ.5700 కడతాను. వచ్చే ఏడాది రూ.12వేలు కాదన్న గ్యారెంటీ ఏమిటి? ఆయిల్.. పెట్రోల్ ధరలు పెరిగాయంటే ఎక్కడో యుద్ధం జరిగిందని కాబట్టి అనుకోవచ్చు.

ఇంటి పన్ను ఎందుకు డబుల్అయ్యింది? కరెంటు బిల్లు.. నిత్యావరసరాల ధరలు ఎందుకు పెరిగాయి? ప్రతి పేదవాడు సినిమా చూడాలని టికెట్ల ధరల్ని తగ్గించారే మీరు.. పన్ను ఎందుకు తగ్గించరు? ఇంత భారీగాపెంచిన పన్నుల్ని పేదలు కట్టగలరా? సగటు మనిషిగా.. రాష్ట్ర పౌరుడిగా.. విజయవాడ వాసిగా ఈ ప్రభుత్వానికి ఈ వాయిస్ మెసేజ్ ద్వారా పెంచిన పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నా" అంటూ ముగించారు. నిజమే.. వినోదం కోసం చూసే సినిమాను కారుచౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆరాటపడే సీఎం జగన్.. ఇంటి పన్నును ఏకంగా యాబై శాతం పెంచటంలోని లెక్క ఏంది? అన్నది మాత్రం ఇప్పుడు అర్థం కాని పరిస్థితి.


Full ViewFull View
Tags:    

Similar News