చంద్ర‌బాబు చిత్తూరు విష‌యంలో కొత్త ఛాలెంజ్ చేశారు!

Update: 2020-03-16 11:30 GMT
గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిన జిల్లాల్లో చిత్తూరు ఒక‌టి. ఆ జిల్లాలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అంత ఉధృతంగా విజ‌యం సాధించిన దాఖ‌లాలు ఏమీ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నెగ్గిన‌ప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో టీడీపీ కి స‌గం సీట్లు ద‌క్కితే అదేగొప్ప అనే ప‌రిస్థితి ఉండేది. అయితే టీడీపీ ఓడిన‌ప్పుడు చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌త్తా చూపింది. కేవ‌లం ఒక్కంటే ఒక్క అసెంబ్లీ స్థానం లో మాత్ర‌మే తెలుగుదేశం పార్టీ నెగ్గింది. అది కూడా చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే!

14 స్థానాలున్న ఆ జిల్లా లో కుప్పంలో త‌ప్ప తెలుగుదేశం పార్టీ జెండా ఎక్క‌డా ఎగ‌ర‌లేదు. అది కూడా చంద్ర‌బాబు నాయుడి మెజారిటీ చాలా వ‌ర‌కూ త‌గ్గిపోయింది. అంత‌కు ముందుతో పోలిస్తే దాదాపు 12 వేల మెజారిటీని కోల్పోయారు చంద్ర‌బాబు నాయుడు. రెండో రౌండ్ కౌంటింగ్ వ‌ర‌కూ చంద్ర‌బాబు నాయుడు వెనుక బ‌డ్డారంటే ఫ‌లితాలు ఎలా వ‌చ్చాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక చంద్ర‌బాబు నాయుడు మెజారిటీ త‌గ్గిపోవ‌డం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపును ఇచ్చింది. గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడును ఓడించ‌డం కూడా క‌ష్టం కాద‌నేంత రీతిలో వైసీపీ నేత‌లు రెడీ అవుతున్నారు. చిత్తూరు జిల్లా లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ యాక్టివిటీస్ చాలా పెరిగాయి కూడా. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో కుప్పం మున్సిపాలిటీని గెలిచి స‌త్తా చాటాల‌ని కూడా వైసీపీ ఉబ‌లాట‌ప‌డుతూ ఉంది.

ఇలాంటి క్ర‌మంలో త‌న సొంత జిల్లాలో త‌న పార్టీ ప‌రిస్థితి గురించి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. అక్క‌డ చెత్త మంత్రి ఉన్నారంటూ.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని చంద్ర‌బాబు నాయుడు దెప్పి పొడిచారు. అంతే కాదట‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలో 14 సీట్ల‌లోనూ తెలుగుదేశం పార్టీ నెగ్గేస్తుంద‌ని కూడా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించుకున్నారు!

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే ఒక్క సీట్లో టీడీపీ నెగ్గిన జిల్లాలో వ‌చ్చేసారి అన్ని సీట్ల‌నూ నెగ్గేస్తామంటూ చంద్ర‌బాబు నాయుడు కొత్త ఛాలెంజ్ చేసేశారు. అయినా ఇంకా దానికి చాలా టైముందేమో. స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌న స‌త్తా చూపించ‌వ‌చ్చు క‌దా!
Tags:    

Similar News