కుప్పంలో ఇలాంటి తప్పు చేయటం ఏమిటి చంద్రబాబు?

Update: 2022-05-11 09:30 GMT
ఏపీ విపక్ష నేత చంద్రబాబు విశ్రాంతి అన్నది లేకుండా అదే పనిగా ఏదో ఒక కార్యక్రమంలో తలమునకలు కావటం తెలిసిందే. సాధారణంగా అధికారం లేని వేళ.. ప్రజాజీవితానికి కాస్త దూరంగా ఉంటూ.. అన్ని అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. ఎప్పుడో ఒకప్పుడు తప్పించి రెగ్యులర్ గా మాట్లాడటం చాలామంది నేతల్లో కనిపించదు. అందుకు భిన్నంగా విపక్ష నేత చంద్రబాబు తీరు ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నా.. విపక్ష నేతగా ఉన్నా ఆయన బిజీబిజీగా ఉంటారు.

ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని పెద్ద ఎత్తున పని చేస్తుంటారు. కరోనా వేళ మాత్రం ఆయన కాస్త పని తగ్గించుకున్నారని చెబుతారు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి ఆయన కొంత తలొగ్గినట్లుగా చెబుతారు. పెరుగుతున్న వయోభారానికి తగ్గట్లుగా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజల మధ్యన ఉండాలన్న ఆయన తపన మీద కొందరు విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెడుతుంటారు. మరికొందరు మాత్రం ఆయన్ను చూసి స్ఫూర్తి చెందుతూ.. మరింతగా పార్టీ కోసం కష్టపడాలన్న కసితో కనిపిస్తుంటారు.

తాజాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బసను ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేయనున్నారు. గతంలోకుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఆర్ అండ్ బీ గెస్టు హౌస్ లో బస చేసేవారు. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా చంద్రబాబు.. ప్రభుత్వ గెస్టు హౌస్ లో కాకుండా ప్రత్యేక బస్సులో సేద తీరాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

దీనికి కారణం.. గతంలో కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఆర్ అండ్ బీ గెస్టు హౌస్ లో సౌకర్యాలు సరిగా లేకపోవటం.. విద్యుత్తు అంతరాయం ఎక్కువగా ఉండటంతో.. ఆయన ఉండేందుకు ఈసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. గడిచిన రెండు పర్యటనల సందర్భంగానే ప్రత్యేక బస్సులోనే ఆయన బస చేశారు.

అయితే..ప్రజా సమస్యల కోసం పోరాడేందుకు వచ్చినప్పుడు లగ్జరీ బస్సులో ఉన్నట్లుగా అందరికి కనిపిస్తుందే తప్పించి.. ఆయన ఎన్ని ఇబ్బందులు పడింది బయటకు రాదు. దీనికి తోడు.. అధికార పార్టీ వారు విమర్శల్ని సైతం చేసే వీలుంది. బస్సు వసతి కంటే కూడా ప్రభుత్వ గెస్టు హౌస్ లో దిగి.. అక్కడి సమస్యల్ని ఎదుర్కొని ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతం లోనూ ప్రత్యేక బస్సులో బస చేయటం ద్వారా విమర్శలకు గురైన చంద్రబాబు.. ఇప్పటికైనా తన తీరును మార్చుకుంటే బాగుంటుందనిచెబుతున్నారు. అసౌకర్యాలకు నెలువుగా ఉండే ప్రభుత్వ గెస్టు హౌస్ లో ఉండి.. ఇబ్బందులు పడటం ద్వారా ఇచ్చే సంకేతం వేరుగా ఉంటుందంటున్నారు. కుప్పం పర్యటన వేళ ఎప్పుడూ చేసే తప్పే ఈసారి చంద్రబాబు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
Tags:    

Similar News