ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ హైదరాబాద్ ను మార్చేసింది

Update: 2022-12-17 05:33 GMT
హైదరాబాద్ మహానగరాన్ని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోయేవారు.. ఆనందించేవారు.. అంతకు మించి ఆసూయపడేవారు.. ఇలా ఎవరికి వారు హైదరాబాద్ మహానగర సోయగాన్ని చూసి మాట్లాడుకునే ప్రతి ఒక్కరికి పాతికేళ్ల క్రితం అసలేం జరిగింది? భాగ్యనగరి భవిష్యత్తును మార్చేయటంలో చంద్రబాబు చేసిన ప్రయత్నం.. ఆయన పడిన కష్టం.. అందుకు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎవరో చెబితే వినే కన్నా.. దానికి కర్త..కర్మ.. క్రియ అన్నట్లు అన్నింటా తానై వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో వినాల్సిన అవసరం ఉంది.

ఇప్పటి హైదరాబాద్ కు అప్పట్లో ఏం జరిగిందన్న విషయం మీద చాలామంది చాలాసార్లు చెప్పటం.. అలా చెప్పే ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోడీ మొదలు సాదాసీదా నాయకుల వరకు చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తుంటారు. బాబును రాజకీయ కోణంలో చూసినప్పుడు.. ఆయన మాటల్నిసెన్సార్ చేయాల్సి ఉంటుంది. కానీ.. ఒక విజనరీ నాయకుడి అనుభవాలన్న కోణంలో చూసినప్పుడు ఆయన చెప్పే మాటలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇవాల్టి రోజున హైదరాబాద్ ఇలా ఉందంటే.. దానికి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి పాలనలో జరిగిన ప్రయత్నాల గురించి ఈ తరం వారికి తెలియాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కు ఐటీ కంపెనీల రాక ఎలా ఉన్నా.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను భాగ్యనగరికి తీసుకువచ్చిన తర్వాత నగర సుడి విపరీతంగా మారిపోవటమే కాదు.. దేశీయ ఐటీకి హబ్ గా మారటంలో కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఐఎస్ బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగిన కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు అప్పట్లో తాను పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని ఆయన నోటి నుంచే వింటే..

-  ఐఎస్ బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు దాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనే ఆలోచనే లేదు. ఇరవై ఏళ్ల క్రితం ఐఎస్ బీ గవర్నింగ్ బోర్డు పరిశీలనలో హైదరాబాద్ పేరే లేదు. మెకిన్సే అండ్ కంపెనీ చీఫ్ రజత్ గుప్తాకు నేను ఫోన్ చేసి పిలిచా. దీంతో బోర్డు సభ్యులు హైదరాబాద్ వచ్చారు.

- హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చి చూసి వెళ్లండని వారిని కోరాను. ఇక్కడకు వచ్చాక వాళ్లను ఒప్పింగలనన్న నమ్మకం ఉంది. చివరకుఅదే జరిగింది. ఇతర రాష్ట్రాల కంటే ఒక వంతు ఎక్కువగానే మేం ఇస్తాం. మీరు ఐఎస్ బీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయండని అడిగాను. మాటల్లో చెప్పింది చేతల్లో చేసి చూపించాను.

-  సంస్థను ఏర్పాటు చేసే సమయంలో ప్రాథమికస్థాయిలో స్థల వివాదాలు ఎదురయ్యాయి. విద్యుత్తు.. రోడ్డు సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాం. ముందు ఐఎస్ బీ వచ్చింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్.. మరొకటి.. ఇలా హైదరాబాద్ బహుహుఖంగా విస్తరించేందుకు కారణమైంది.

-  మైక్రో సాఫ్ట్ ప్రాంగణాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఢిల్లీ వచ్చిన బిల్ గేట్స్ ను కలవటానికి టైం అడిగాను. రాజకీయ నాయకులతో నాకేం పని..కుదరదని బదులిచ్చారు. అతి కష్టమ్మీద పది నిమిషాలు సమయం ఇచ్చారు. కానీ.. మీటింగ్ మొదలయ్యాక 45 నిమిషాలు మాట్లాడానను. రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చటమే లక్ష్యమని చెప్పాను. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చాను. అదే బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది.

-  నేనిచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను చూసిన తర్వాత బిల్ గేట్స్ మాట్లాడుతూ.. మా సంస్థలోని ఉన్నత ఉద్యోగులు సైతంఇంత బాగా ప్రెజెంటేషన్ ఇవ్వలేరని బిల్ గేట్స్ అన్నారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఆయన్ను కలిశాను. మైక్రోసాఫ్ట్ క్యాంపస్ తరలివస్తే.. ఇతర ఐటీ కంపెనీలు వాటంతటవే హైదరాబాద్ కు తరలి వస్తాయన్నది నా నమ్మకం. అందుకే బిల్ గేట్స్ వెంటపడ్డాను. ఆ తర్వాత హైదరాబాద్ లో క్యాంపస్ పెడుతున్నామని బిల్ గేట్స్ నుంచి ఫోన్ వచ్చింది.

-  అప్పట్లో ప్రధాని వాజ్ పేయి మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ బీమా నియంత్రణ.. అభివ్రద్ధి ప్రాధికార సంస్థను హైదరాబాద్ కు తీసుకొచ్చాం. ఆ సందర్భంగా వాజ్ పేయ్ ఒకసారి.. 'మీరు అన్నీ అడుగుతున్నారు. చివరికి దేశ రాజధానిని హైదరాబాద్ లో పెట్టాలని కోరేటట్లు ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News