8 నెలల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు.. బాలయ్య రాలేదెందుకు?

Update: 2022-07-19 04:42 GMT
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ప్రాంగణాలు సందడిగా మారాయి. ఏపీ విషయానికి వస్తే.. తన సతీమణిని అవమానించిన నేపథ్యంలో.. అధికారాన్ని చేపట్టిన తర్వాతే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి బయటకు వెళ్లిన చంద్రబాబు..రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత చంద్రబాబు అసెంబ్లీ భవనంలోకి అడుగు పెట్టటం ఇదే తొలిసారి.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా తన నివాసం నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరిన చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు బాలక్రిష్ణ.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు మాత్రం తమ ఓటును వినియోగించుకోలేకపోయారు. వీరిద్దరు విదేశాల్లో ఉన్నందున ఓటింగ్ కు హాజరు కాలేకపోయారు.

అదే సమయంలో ఏపీకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఏపీలో  కాకుండా తెలంగాణ అసెంబ్లీలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే ఎం.మహీధర్ రెడ్డి తన ఓటును తెలంగాణ అసెంబ్లీలో వేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో మొదట ఓటు వేసింది మంత్రి కేటీఆర్ అయితే.. రెండో ఓటు వేసింది ఏపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి. చివరి ఓటును కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి వేశారు. తెలంగాణలో మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉండగా.. 117 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

టీఆర్ఎస్ కు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు మంత్రి గంగుల కమలాకర్ కాగా మరొకరు చెన్నమనేని రమేశ్ బాబు. గంగులకు కరోనా కారణంగా ఓటింగ్ కు దూరంగా ఉండగా.. చెన్నమనేని విదేశాల్లో ఉన్న కారణంగా ఓటింగ్ కు హాజరు కాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసం నుంచి బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి ఓటేశారు.

కాంగ్రెస్ కు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. జగ్గారెడ్డిలు మిగిలిన వారితో కాకుండా విడిగా వచ్చి ఓటేయటం గమనార్హం. రాష్ట్రపతివి ఎన్నికలకు సంబంధించి ఈసారి పింక్ బ్యాలెట్ పేపర్ ను వినియోగించారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సును ఈ ఉదయం (మంగళవారం) ఆరున్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఎన్నికల సందర్భంగా అధికారులు ఇచ్చిన ప్రత్యేక పెన్ను ద్వారానే సభ్యులు తమ ఓట్లు వేశారు.
Tags:    

Similar News