రాజమండ్రి టికెట్.. అటూఇటూ తిరిగి వాళ్లకా!

Update: 2019-03-13 08:03 GMT
రాజమండ్రి ఎంపీ టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో అనేక తర్జనభర్జనలు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరిని పోటీ చేయించాలనే అంశం మీద చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు సాగిస్తూ ఉన్నారు. ఒకవైపు నామినేషన్లకు సమయం ముంచుకు వస్తున్నా… రాజమండ్రి టికెట్ విషయంలో మాత్రం బాబు సమాలోచనలు సాగుతూ ఉండటం విశేషం.

వాస్తవానికి రాజమండ్రిలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే నెగ్గింది. అందునా బాబుకు అతి సన్నిహితుడిగా ఉన్న మురళీ మోహన్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. డబ్బుల విషయంలో కొదవలేదు. అది కూడా ఒక్క టర్మ్ మాత్రమే  చేశారాయన. ఇలాంటి నేపథ్యంలో ఆయనను మళ్లీ అక్కడ పోటీ చేయించాల్సింది. అయితే ఎందుకో మురళీ మోహన్ తప్పుకోవడం… చంద్రబాబు నాయుడు  వేరే అభ్యర్థి విషయంలో అనేక లెక్కలు వేసి కసరత్తు చేస్తూ ఉన్నారు.

ఇక్కడ వేరే కథ నడుస్తోందని.. రాజమండ్రి విషయంలో టీడీపీ- జనసేనల మధ్యన ఒప్పందం కుదిరిందని..ఈ సీట్లో జనసేనకు టీడీపీ సహకారం అందించబోతోందని మరో ప్రచారం కూడా సాగుతోంది.  అందుకే ఈ సీటు విషయంలో డమ్మీ అభ్యర్థి వెదుకులాటలో ఉన్నారట  చంద్రబాబు.

అందుకే రాజమండ్రిలో మురళీ మోహన్ ను తప్పించారని సమాచారం. ఆ సంగతలా ఉంటే.. ఎవరు పోటీ అనే  విషయంలో మాత్రం చర్చ సాగుతూ ఉంది. ఇప్పటికే పలువురు నేతలను ఇక్కడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు కోరడం జరిగిందట.

బొడ్డు భాస్కర రామారావును ఇక్కడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరారట. అయితే.. ఆయన ఆర్థికంగా ఒక ఎంపీ సీట్లో పోటీ చేసేంత స్థాయిలో లేరట! అందుకే.. ఆయన తప్పుకున్నట్టుగా టాక్. అలాగే.. ఈ సీటు  విషయంలో బాలయ్య చిన్నల్లుడు భరత్ పేరును కూడా బాబు పరిగణనలోకి తీసుకున్నారట. ఆయనా నో చెప్పారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో.. చివరకు మురళీ మోహన్ కోడలుకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

మురళీ మోహన్ ఈ కోరికను మొదట్లోనే కోరారని, తన స్థానంలో తన కోడలు రూపకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరారట. అయితే ఆ విషయంలో మొదట సానుకూలంగా లేని చంద్రబాబు.. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి.. ఆమెకే టికెట్ ఖరారు చేశారనే మాట వినిపిస్తూ ఉంది!
Tags:    

Similar News