సూప‌ర్ స్టార్ మ‌హేష్ కోసం చంద్ర‌బాబు త్యాగం!

Update: 2020-10-22 05:00 GMT
ఔను! మీరు చ‌దువుతున్న నిజ‌మే. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబు త్యాగాలు చేశార‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. మ‌రీ ముఖ్యంగా ఈ విష‌యం గుంటూరు టీడీపీలో భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. 2014, 2019 ఎన్నిక‌ల్లో సూప‌ర్ స్టార్ నేరుగా టీడీపీకి మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోయినా.. వారి కుటుంబం నుంచి ఎంపీ రేసులో ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌ను గెలిపించాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న గెలిచార‌నే టాక్ కూడా ఉంది. జ‌గ‌న్ సునామీ భారీ ఎత్తున వీచినా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో హేమా హేమీలు ఓట‌మిపాలైనా.. గ‌ల్లా జ‌య‌దేవ్ మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు సూప‌ర్ స్టార్ మ‌హేష్ సింప‌తీ కోసం పాకులాడుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల టీడీపీని ప్ర‌క్షాళ‌న చేసిన స‌మ‌యంలో రాష్ట్ర క‌మిటీతో పాటు.. పొలిట్ బ్యూరోలోనూ ప‌ద‌వులు కేటాయించారు. ఎక్క‌డెక్క‌డి నేత‌ల‌నో పిలిచి ప‌ద‌వులు అప్పగించారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన కేశినేని నాని, ప్ర‌త్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ వంటివారిని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. పోనీ.. ప‌ద‌వులు లేవు.. అందుకే ఇవ్వ‌లేదు. .అని స‌రిపెట్టుకుందామనుకున్నారు.కానీ, జ‌రిగిన ప‌రిణామాలు.. పంపకాలైన ప‌ద‌వుల‌ను చూస్తే.. మాత్రం ఇక్క‌డ తేడా కొట్టింద‌నే వ్యాఖ్య‌లు గుంటూరు నేత‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ప్ర‌ధానంగా గ‌ల్లా కుటుంబానికి రెండు ప‌ద‌వులు కేటాయించారు. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ను పార్టీలో అత్యంత కీల‌క‌మైన‌ పొలిట్ బ్యోరోలోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఎటొచ్చీ.. ఆయ‌న మాతృమూర్తి మాజీ మంత్రి, చిత్తూరు నుంచి వ‌రుస ప‌రాజ‌యం చ‌విచూసిన గ‌ల్లా అరుణ‌కు మ‌ళ్లీ ప‌ద‌వి ఇచ్చారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇటీవ‌లే రాజీనామా చేశారు. పార్టీలో నూతన నియామకాలు చేపడుతున్న తరుణంలో అధిష్ఠానం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకే పక్కకు తప్పుకున్నట్టు ఆమె తెలిపారు.వయసు రీత్యా ఇపుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడి తిరిగి పనిచేయలేకపోతున్నానని చెప్పారు.

దీంతో ఆమె నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టే అవ‌కాశం లేకుండా పోయింది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న అరుణ కుమారికి చంద్ర‌బాబు మ‌రోసారి ప‌ద‌వి కేటాయించారు. అది కూడా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆమెను నియమించారు. తాను ప‌నిచేయ‌లేన‌ని చెప్పి.. ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కూడా తిర‌గ‌క‌ముందుగానే.. అరుణ‌కు మ‌రో కీల‌క ప‌ద‌విని ఎందుకు క‌ట్ట‌బెట్టారు? నాయ‌కులు లేక పోవ‌డ‌మా? లేక మ‌రేదైనా ఉందా? అనే కోణంలో గుంటూరు నేత‌లు మెద‌డుకు ప‌నిచెప్పారు. ఈ క్ర‌మంలో వారు చెబుతున్న మాట ఏంటంటే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నుంచి సింప‌తీ కోరుకుంటున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా ఆయ‌న‌ను వాడుకునేందుకు బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని. ఈ క్ర‌మంలోనే గ‌ల్లా కుటుంబం వ‌ద్దు మొర్రో అంటున్నా.. ప‌ద‌వులు ఇస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి బాబు వ్యూహం ఫ‌లించేనా? చూడాలి.
Tags:    

Similar News