ప్రత్యేక హోదా రగిలిస్తున్న చంద్రబాబు

Update: 2021-12-11 10:31 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు మరో భారీ స్టెప్ వేశారు. ఈసారి ప్రత్యేక హోదాను రగిలించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దామంటూ వైసీపీకి ఛాలెంజ్ విసిరారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసేందుకు ముందుకు రావాలని చాలెంజ్ విసిరారు.

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ మాయ మాటలు, సన్నాయి నొక్కులు మానుకొని సూటిగా స్పందించాలని చంద్రబాబు సవాల్ చేశారు. రెండు పార్టీల ఎంపీలు రాజీనామా చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుదామంటూ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు ప్రతిపాదించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం ఇటీవల ప్రకటించిందని గుర్తు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్య పెడుతారంటూ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని.. లేని పక్షంలో పదవులకు రాజీనామా చేస్తామని గతంలో జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు హోదా సాధించలేకపోయారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది ప్రజలను మోసగించడం దగా చేయడం కాదా అని ప్రశ్నించారు.

విభజన హామీలను సాధించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.

జగన్ సర్కార్ పై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని.. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా వస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పాలించే హక్కు వైసీపీ కోల్పోయిందన్నారు. ఓటీఎస్ విషయంలో తాము వదిలిపెట్టేది లేదని చంద్రబాబు అన్నారు. ఇళ్ల పట్టాలని రిజిస్ట్రర్ చేయాలి తప్ప ఎవరు పడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేస్తారా? అని ప్రశ్నించారు.
Tags:    

Similar News