రైతులు చంద్రబాబుకు షాకివ్వబోతున్నారా?

Update: 2019-04-10 10:35 GMT
ఎన్టీఆర్‌ను గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించడం అనూహ్యమే. ఎన్టీఆర్ అభిమానుల వ్యతిరేకతను తట్టుకుని కూడా నెగ్గిన బాబు.. ఐదేళ్ల తర్వాత మాత్రం విజయం సాధించలేకపోయాడు. అందుకు ప్రధాన కారణం వ్యవసాయంపై, రైతులపై ఆయన చూపిన వివక్ష, నిర్లక్ష్యం. వ్యవసాయం దండగ అనే భావనతో కనిపించిన ఆయనకు రైతులు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు. దారుణ పరాభవాన్ని కట్టబెట్టారు. రైతుల మిత్రుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్‌ కు ఒకటికి రెండుసార్లు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది. యు టర్న్ తీసుకుని తాను రైతు పక్షపాతినని చాటుకునే ప్రయత్నం చేశాడు. ఏకంగా రుణమాఫీ లాంటి భారీ హామీ ఇచ్చి గత పర్యాయం అధికారంలోకి రాగలిగారు. బాబు అధికారం చేపట్టడానికి ముఖ్య కారణాల్లో రుణ మాఫీ హామీ ఒకటి.

ఐతే అప్పుడు అధికారంలోకి రావడానికి కారణమైన ఆ హామీనే ఇప్పుడు బాబు ఓటమికి దారి తీస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకే విడతలో సంపూర్ణ రుణ మాఫీ అని చెప్పిన బాబు.. తర్వాత మాట మార్చేశారు. దీనికి అనేక పరిమితులు పెట్టారు. రుణం విషయంలో నియంత్రణ విధించారు. దీనికి తోడు ఒక విడతలో రుణాలు మాపీ చేయలేకపోయాడు. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి కూడా ఇంకా రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాలేదు. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఒక విడత రుణ మాఫీ డబ్బులు వేసి రైతుల్ని ఆకర్షించాలని బాబు భావించారు. ఈ దిశగా రైతుల్ని ఊరించారు. కానీ వారి ఆశ నిరాశే అయినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయని, తమ బంగారం విడిపించుకురావచ్చని.. ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని బ్యాంకులకు వెళ్లిన రైతులకు తిరస్కారం ఎదురైంది. డబ్బులు పడలేదని అధికారులు చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. బ్యాంకుల ముందు ఈ మేరకు బోర్డులు కూడా పెడుతున్నారు. మరి ఎక్కడ తేడా జరిగిందన్నది తెలియడం లేదు. బాబు మాట ఇచ్చి తప్పిన నేపథ్యంలో రైతులు ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తారేమో అని తెలుగుదేేశం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Tags:    

Similar News