మీ మంత్రి ఇచ్చిన డేట్‌ని మ‌రిచారా బాబు?

Update: 2016-03-30 06:22 GMT
ఏపీ స‌ర్కారు కోటి ఆశ‌లుపెట్టుకున్న ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఏదైనా ఉందా? అంటే అది పోల‌వ‌ర‌మే. ఆ ప్రాజెక్టును కానీ పూర్తి చేసి.. దాని ఫ‌లాలు రైతుల‌కు కానీ అంద‌జేస్తే.. ఏపీలో త‌మ ప‌వ‌ర్ కు తిరుగు ఉంటుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు ధీమాగా చెబుతుంటారు. అయితే.. ప‌ట్టిసీమ లాంటి బుడ్డ ప్రాజెక్టును క‌ట్టేసినంత ఈజీగా పోల‌వ‌రాన్ని పూర్తి చేయ‌లేని ప‌రిస్థితి. ఈ విష‌యం అంద‌రికంటే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బాగానే తెలుసు. నిజానికి ప‌ట్టిసీమ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనం బాబుకు తెలియంది కాదు.

కానీ.. త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరును ఘ‌నంగా ప్ర‌క‌టించుకోవ‌టం.. త‌న పాల‌నా సామ‌ర్థ్యాన్ని ప్ర‌పంచానికి తెలిసేలా చేయ‌టం కోస‌మే ప‌ట్టిసీమ ప్రాజెక్టును షురూ చేయ‌టం.. రికార్డు స‌మ‌యంలో దాన్ని పూర్తి చేశార‌న్న విష‌యం తెలిసిందే. ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయ‌టం ద్వారా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల పూర్తి విష‌యంలో త‌మ‌కున్న క‌మిట్‌మెంట్‌ను ప్ర‌ద‌ర్శించిన బాబు స‌ర్కారు.. పోల‌వ‌రం విష‌యంలోనూ అలాంటి క‌మిట్ మెంట్‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇందులో భాగంగా పోల‌వ‌రంప్రాజెక్టును పూర్తి చేసే విష‌యాన్ని ఏపీ ఇరిగేష‌న్ మంత్రి దేవినేని ఉమ త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటారు. 2018 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న త‌ర‌చూ చెప్ప‌టం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విష‌యంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. మంగ‌ళ‌వారం అసెంబ్లీ స‌మావేశాల్లో పోల‌వ‌రంప్రాజెక్టు గురించి మాట్లాడే సంద‌ర్భంలో ఈ ప్రాజెక్టును 2019 మార్చి 29నాటికిపూర్తి చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఓ ప‌క్క ఏపీ మంత్రి 2018లోనే పోల‌వ‌రం పూర్తి అవుతుంద‌ని చెబుతుంటే.. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి మాత్రం అందుకు భిన్నంగా 2019 మార్చి 29 లోపు పూర్తి చే్స్తామ‌న‌టం చూసిన‌ప్పుడు.. ఎవ‌రి డేట్‌ను న‌మ్మాల‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. అధికార‌ప‌క్షం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అంశం మీద మంత్రిమాట ఒక‌లా.. ముఖ్య‌మంత్రి మాట మ‌రోలా ఉండ‌టం ఏమిటి? ఈ గ్యాప్ ఎందుకు వ‌చ్చిన‌ట్లంటారు చంద్ర‌బాబు..?
Tags:    

Similar News