వైఎస్ నా బెస్ట్ ఫ్రెండ్‌.. అన్న‌దెవ‌రంటే?

Update: 2019-07-18 06:49 GMT
మీరు చ‌దివింది నిజ‌మే. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నోటి నుంచే వ‌చ్చిన మాట‌లు. ఆస‌క్తిక‌రంగా అనిపించే ఈ మాట‌లు బాబు నోటి నుంచి ఎప్పుడు వ‌చ్చాయి?  ఎలా వ‌చ్చాయి?  ఏ సంద‌ర్భంలో వ‌చ్చాయి?  లాంటి విష‌యాల్లోకి వెళితే..కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్ర‌బాబుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి.

ఓప‌క్క బుగ్గ‌న మ‌రోప‌క్క అంబ‌టి రాంబాబుతో ఆగ‌మాగం అవుతున్న బాబు.. తాజాగా త‌న మీద చేసిన ఆరోప‌ణ‌ల‌తో బ‌ర‌స్ట్ అయ్యారు.

వైఎస్ చ‌నిపోయిన వేళ‌లో కూడా చెప్ప‌ని మాట‌ను తాజాగా అసెంబ్లీలో చెప్పారు చంద్ర‌బాబు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న బెస్ట్ ఫ్రెండ్ అని.. ఆయ‌న‌తో త‌న‌కు రాజ‌కీయ వైరం త‌ప్పించి వ్య‌క్తిగ‌త వైరం లేద‌న్నారు. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా విగ్ర‌హాల తొల‌గింపుపై చ‌ర్చ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై అంబ‌టి రాంబాబు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ విగ్ర‌హాలంటే చంద్ర‌బాబుకు క‌డుపుమంట అని.. విజ‌య‌వాడ‌లో ఎవ‌రికి అడ్డం లేని రీతిలో వైఎస్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తే.. దాన్ని రోజూ చూడాల్సి వ‌స్తుంద‌ని ఆ విగ్ర‌హాన్ని తీసేసిన దుర్మార్గం చంద్ర‌బాబుద‌ని ఆరోపించారు. రోజూ వైఎస్ విగ్ర‌హాన్ని చూసి ఓర్వ‌లేక.. ఆ విగ్ర‌హాన్ని తొల‌గించాడీ మ‌హానుభావుడ‌ని మండిప‌డ్డారు.

దీనిపై స్పందించారు చంద్ర‌బాబు. వైఎస్ త‌న బెస్ట్ ఫ్రెండ్ అని అభివ‌ర్ణించారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి తాను 1975 నుంచి 1983 వ‌ర‌కు క‌లిసి పొలిటిక‌ల్ జ‌ర్నీ చేసిన వైనాన్ని ప్ర‌స్తావించారు. రాజశేఖ‌ర్ రెడ్డి.. తాను ఒకే రూమ్ లో ఉండేవాళ్ల‌మ‌ని.. జ‌గ‌న్ కు త‌మ స్నేహం తెలియ‌క‌పోవ‌చ్చాన్నారు. త‌న‌కు వైఎస్ తో రాజ‌కీయ విభేద‌మే త‌ప్పించి వ్య‌క్తిగ‌త వైరం అస‌లు లేద‌ని చెప్పారు. అయితే.. ఇవే మాట‌లు అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నోటి నుంచి వ‌చ్చి ఉంటే వేరుగా ఉండేవి. అన్ని ర‌కాలుగా తాను ఫిక్స్ అయిన వేళ‌.. వైఎస్ త‌న బెస్ట్ ఫ్రెండ్ అన్న మాట బాబు నోటి నుంచి రావ‌టం చూస్తే.. నిస్సహాయ‌స్థితిలో వైఎస్ పేరు మాత్ర‌మే త‌న‌ను కాపాడుతుంద‌న్న భావ‌న‌తో ఆయ‌న నోటి నుంచి ఈ మాట‌లు వ‌చ్చిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు.


Tags:    

Similar News