పొలిటికల్ ట్రెండ్: సొంతవాడు వద్దు..పక్క పార్టీ వాడు ముద్దు!

Update: 2019-03-12 14:30 GMT
పొరుగింటి పుల్ల కూర రుచి ఎక్కువ..అనేది సామెత. ఇలాంటి మాటలను పెద్ద వాళ్లు ఊరికే చెప్పి ఉండరు. ఏ విషయంలో అయినా అలాంటి సామెతలు అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ ట్రెండ్ కు కూడా! ఏపీలోని ప్రధాన పార్టీ రాజకీయ నేతల తీరును గమనిస్తే.. వీళ్లు సొంత పార్టీ నేతల మీద కంటే పక్క పార్టీల నేతల మీదే ఎక్కువ నమ్మకాన్ని ఉంచుతున్నారని స్పష్టం అవుతోంది. తమ పార్టీలో ఐదేళ్లుగా కష్టపడి పని చేసి, ఇప్పుడు నిజాయితీగా సీట్లు అడుగుతున్న చాలా మందిని పార్టీల అధినేత పక్కన పడేస్తూ ఉండటాన్ని గమనించవచ్చు.

ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు.. ఇప్పుడు ఏపీ రాజకీయంలోనే ఇదో ట్రెండ్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న వైనాన్ని గమనించినా - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను గమనించినా ఈ విషయం స్పష్టం అవుతూ ఉంది. ఈ ఇరు పార్టీల్లోనూ.. పాత నేతలను పట్టించుకోవడం మానేసి.. కొత్త వాళ్లకు పెద్ద పీటలు వేస్తున్న వైనం స్పష్టం అవుతోంది.

ముందుగా తెలుగుదేశం పార్టీ జాబితాను పరిశీలిస్తే..ఇలాంటి విడ్డూరాలు ఎన్నో కనిపిస్తాయి. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేస్తూ ఉన్నారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరా? అంటే.. ఎందుకు లేరు!

బలమైన వాళ్లే ఉన్నారు.  గట్టి పోటీ ఇచ్చిన వారు ఉన్నారు. ఏదో త్రుటిలో వారు ఓడిపోయారంతే. అలాంటి వాళ్లు ఉన్నా బాబు ఫిరాయింపు నేతలకు పెద్ద పీట వేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా బాబు తీరు మారడం లేదు!

ఫిరాయింపు  నేతలు వచ్చినా పార్టీలో పని చేసిన నేతలను బాబు పూర్తిగా లైట్ తీసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతకన్నా విచిత్రం ఏమిటంటే.. గత ఎన్నికల్లో ఓడి - ఐదేళ్లుగా పార్టీ తరఫున గట్టిగా పని చేసిన వారికి కూడా బాబు ఇప్పుడు నామాలు పెడుతూ ఉండటం!

కర్నూలు జిల్లా రాజకీయాన్నే  అందుకు ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ కష్టపడ్డ వారికి బాబు ఝలక్ ఇస్తున్నారు. ఆలూరులో వీరభద్ర గౌడ్ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీ తరఫున కష్టించి పని చేశారు. అయితే ఇప్పుడు కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతోందని.. చంద్రబాబు నాయుడు గౌడ్ కు టికెట్ ఇవ్వడం లేదు. కోట్ల కుటుంబం ఇప్పుడు చేరగానే.. ఒక ఎంపీ టికెట్ మాత్రమే కాదు, పార్టీ తరఫున పని చేసిన ఒక బీసీ నేతను కూడా బాబు పక్కన పెట్టేశారు!  ఇప్పుడు సదరు గౌడ్ లబోదిబోమంటున్నారు. అయినా పట్టించుకునే వారు లేరు!

కేవలం అది మాత్రమే కాదు.. ఇలాంటి ఉదాహరణలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ  తరఫున ఇన్నాళ్లూ పని  చేసిన  వారిని కాదని.. ఫిరాయింపుదారులకు - ఎన్నికల ముందు వచ్చి చేరుతున్న వాళ్లకు టీడీపీలో టికెట్లు ఖరారు అవుతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్ సీటు కూడా ఇందుకు మరో ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకొంటూ పోతే చాలా కథలున్నాయి. ఫిరాయింపుదారులకు టికెట్లు ఖరారవుతున్న నియోజకవర్గాలు అట్టుడుకుతున్నాయి.

అయితే ఎవరేం గోల చేసినా తగ్గేది లేదని.. చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఇంకా టీడీపీలో చేరని కొణతాల రామకృష్ణకు, వంగవీటి రాధాకు టీడీపీ టికెట్లు ఖరారు అనే వార్తలు వస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! అక్కడ ఇన్ చార్జిలు లేరా అంటే ఉన్నారు.. వాళ్లు వద్దు.. కొత్త వాళ్లు కావాలి.. వాళ్లే గెలుపు గుర్రాలట! ఆఖరికి ఏమీ లేకుండా పోయిన కాంగ్రెస్ నుంచి కూడా ఐదారు మందిని చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారు చంద్రబాబు!

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ మధ్యనే అధికార పార్టీ నుంచి పలువురు సిట్టింగులను చేర్చుకున్నాను జగన్ మోహన్ రెడ్డి. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ వాళ్లను ఎదుర్కొని నిలిచిన వైసీపీ ఇన్ చార్జిలది అథోగతి అయ్యింది. కొత్త వాళ్లు రావడంతోనే.. పాత వాళ్లను పట్టించుకోవడం మానేస్తూ ఉన్నారు. వాళ్లు ఉంటే ఉండొచ్చు.. పార్టీని వీడితే వీడొచ్చు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్న వైనం స్పష్టం అవుతోంది.

మరి ఏం లెక్కలు వేసుకుంటున్నారో.. ఏమో కానీ.. రెండు ప్రధాన పార్టీలు కూడా.. ఆఖర్లో వచ్చి చేరుతున్నవారిని అక్కున చేర్చుకొంటూ ఉండటాన్ని మాత్రం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఐదేళ్లు కష్టపడనక్కర్లేదు.. ఆఖర్లో ఎంట్రీ ఇస్తే చాలు… ఇదా రాజకీయ సూత్రం అని ఆశ్చర్యపోతూ ఉన్నారు!
Tags:    

Similar News