ఇద్దరు సీఎంలు ఢిల్లీలో భేటీ అవుతున్నారా?

Update: 2015-12-09 09:44 GMT
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఒకేసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టడంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీకి మారింది. సీఎం కేసీఆర్ నిన్ననే దేశ రాజధానికి చేరుకోగా, చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో అడుగుపెట్టారు. కేంద్ర‌ మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ రిసెప్షన్‌ కి ఈ ఇద్దరూ ఈ రోజు హాజరు కాబోతున్నారు. గురువారం వీరు భారీ ఎత్తున నిర్వహిస్తున్న శరద్ పవార్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని సమాచారం.  కాగా కేసీఆర్ - చంద్రబాబు కూడా ఢిల్లీలో భేటీ అవుతారని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వీరిద్దరి మధ్య భేటీని ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఆ భేటీలో వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారన్నది కూడా ఆసక్తికరమే.

ఢిల్లీలో వీరు విభజన చట్టంలో అమలు కావలసిన అంశాలు - పెండింగ్ ప్రాజెక్టులపై వేర్వేరుగా కేంద్ర మంత్రలతో భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో పాటు పర్యాటక శాఖ మంత్రితోనూ భేటీ అయి వివిధ అంశాలపై చర్చించనున్నారు. మరి కొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ అయితే రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీ అవుతారు.
Tags:    

Similar News