ఇద్దరు చంద్రులూ అడిగారు..నరేంద్రుడు ఇస్తాడా?

Update: 2015-09-06 05:51 GMT
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంశం మీదనైనా సరే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులూ ఏకాభిప్రాయాన్ని వెల్లడించడం అనేది అనూహ్యమైన సంగతి. అయితే ఒక్క విషయంలో మాత్రం ఈ ఇద్దరికీ అభిప్రాయంలో వ్యత్యాసం లేదు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు చంద్రులూ.. కనీసం వేర్వేరుగా అయినా కేంద్రాన్ని ఒకే కోరిక కోరుతున్నారు. కాకపోతే.. వారి కోరికను కేంద్రంలోని నరేంద్రుడు మన్నిస్తాడా లేదా అనేది కీలకంగా ఉంది.

ఇంతకూ విషయం ఏంటంటే.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మన దేశంలో అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ తాజాగా తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్రం ఇచ్చే అవార్డులకు సిఫారసులు చేస్తూ కమిటీ రూపొందించిన పలు పేర్ల జాబితాలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు గానీ.. పీవీ పేరును భారతరత్న కు సిఫారసు చేయడం అనేది.. ఆయన సూచన తోనే జరిగినట్లుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి తెలుగుజాతి నుంచి జాతీయస్థాయిలో తిరుగులేని రాజకీయవేత్తగా, దార్శనికుడైన నాయకుడిగా, మేధావిగా, భాషావేత్తగా అనేక రకాలుగా ఖ్యాతిని ఆర్జించడంతో పాటూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధానిగా పనిచేసినా.. ప్రాధాన్యం పరంగా విస్మృతికి గురైన పీవీ నరసింహారావు కు భారతరత్న ఇవ్వడం గురించి టీ సర్కారు సిఫారసు చేయబోతోంది.

పీవీ నరసింహారావు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే అయినప్పటికీ.. తెలుగుజాతి మొత్తం ఆయనను తమ వాడిగానే గుర్తిస్తుంది. టీ సర్కారు ఇప్పుడు సిఫారసు చేయబోతున్నది గానీ.. ఏపీ సర్కారు ఇదివరలోనే పీవీ మరియు ఎన్టీఆర్‌ లకు భారతరత్న ఇవ్వాలంటూ కేబినెట్‌ తీర్మానం చేసి.. ఆమేరకు కేంద్రానికి విజ్ఞప్తిని పంపింది. ఇప్పుడు తెలంగాణలో కమిటీ రూపొందించిన జాబితాను కేసీఆర్‌ ఆమోదించేస్తే గనుక.. పీవీ పేరును భారతరత్న కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేసినట్లు అవుతుంది.

అయినా సరే.. కేంద్రం ఆయనకు భారతరత్నను ప్రకటిస్తుందా లేదా అని ఆయన అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల వాజపేయికి ఈ అవార్డు ఇచ్చారు. ఈ దఫా పీవీకి ఇస్తారా లేదా అనేది.. కేంద్రం విచక్షణకు లోబడి ఉంటుంది. నరేంద్ర మోడీ నిర్ణయాలు.. అనేక రకాలుగ భవిష్య ప్రయోజనాలకు ముడిపడి మాత్రమే ఉంటాయని.. ఆయన తీరును గమనించిన ఎవరైనా అంచనా వేస్తారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News