బాబు, కేసీఆర్ ఆశ నిరాశే అయ్యేట్లుంది

Update: 2017-06-09 04:38 GMT
తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుదీర్ఘంగా అభ్య‌ర్థిస్తున్న ఏకైక అంశం ఏదైనా ఉందా అంటే...అది త‌మ రాష్ట్రంలో శాసనసభ సీట్లు పెంచమ‌ని కోర‌డ‌మే. త‌మ‌దైన శైలిలో లాబీయింగ్ చేసుకోవ‌డం ద్వారా 2019లో రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగే లోగా శాసన సభల సీట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ - తెలంగాణ సీఎంలు అయిన నారా చంద్ర‌బాబు నాయుడు - కేసీఆర్‌కు ఈ విష‌యంలో ఇప్ప‌ట్లో నిర‌స‌న త‌ప్పేటట్లు లేదు. ఢిల్లీవ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ శాసనసభ సీట్లను 119 నుండి 175 - ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సీట్లను 175 నుండి 225 సీట్లకు పెంచవలసి ఉన్నది. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం దీనికి ఒక లింక్ పెట్టటం తెలిసిందే. రాజ్యాంగంలోని 10(3) ప్రకారం 2026 వరకు లోక్‌ సభ - శాసన సభల సీట్లను పెంచేందుకు వీలు లేదు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచాలంటే మొదట రాజ్యాంగంలోని 170(3)ని సవరించవలసి ఉంటుంది. ఆర్టికల్ 170(3) లేదా ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లును పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగే లోగా శాసన సభల సీట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర సమాచార - పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కృషి మూలంగా ఈ ప్రక్రియ బాగా ఉపందుకున్నది. అయితే బీజ‌పీ అధ్యక్షుడు అమిత్ షా కార‌ణంగా దీనికి బ్రేక్ ప‌డింద‌ని అంటున్నారు.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన తరువాత ఎన్.డి.ఏ ప్రభు త్వం ఆలోచనలో మార్పు వచ్చిందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభ సీట్ల సంఖ్య పెంచటం వలన తెలంగాణలో టీఆర్ ఎస్‌ కు - ఆంధ్ర ప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీలకు రాజకీయం ప్రయోజనం కలుగుతోంది తప్ప తమకు కాదని రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులు మొదటి నుండి వాదించటం తెలిసిందే. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తూ టీఆర్ ఎస్‌ ను రాజకీయంగా ఎదుర్కొంటున్న సమయంలో శాసన సభ సీట్ల సంఖ్యను పెంచటం ద్వారా ఆ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించటం మంచిది కాదని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని స‌మాచారం. అమిత్ షా ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్ ఎస్ ప్రభుత్వం పనితీరును దుయ్యబట్టటం తెలిసిందే. అమిత్ షా ఆరోపణలను ఖండించేందుకు స్వయంగా చంద్రశేఖరరావు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారుకు మేలు చేసే చ‌ర్య‌ల‌కు మ‌నం ఎందుకు స‌హ‌క‌రించాల‌నే ప్ర‌శ్న ఎదురై ఫైలు వెన‌క్కుపోయిన‌ట్లు స‌మాచారం. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచేందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం న్యాయ శాఖలో దుమ్ముకొట్టుకుపోతోందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News