కేసీఆర్‌ ముందు తలదించిన చంద్రబాబు!

Update: 2016-09-15 04:22 GMT
అహంకారం ప్రదర్శించినందుకు ఫలితం కనిపించింది. చివరికి కేసీఆర్‌ ముందు తల దించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా అంతే.. కానీ తన అటు కేంద్రంతోను - ఇటు పొరుగు రాష్ట్రంతోను ఉన్న తగాదాలను సామరస్య ధోరణిలోనే పరిష్కరించుకోవాలని.. ఇప్పట్లో చిలక పలుకులు పలుకుతున్న చంద్రబాబునాయుడు.. వేరే గత్యంతరం లేక కేసీఆర్‌ ముందు తలదించవలసి వచ్చిందని జనం అనుకుంటున్నారు. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా తాను ఏకపక్షంగా తేదీని ప్రకటించినందుకు, ఇప్పుడు చంద్రబాబే ఓ మెట్టు దిగివచ్చి - చివరకు కేసీఆర్‌ చెప్పిన తేదీ నాటికే ఆయనతో భేటీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జలాల విషయంలో పంపకాల గురించి నిర్ణయం తీసుకోవడానికి.. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్వహించాలని కేంద్రం భావించింది. ఈ మేరకు తెలంగాణ - ఏపీ సీఎంలకు లేఖలు రాసి 11 - 18 - 19 తేదీల్లో ఎప్పుడు వీలవుతుందో చెప్పాలంటూ కేంద్రం సూచింది. ముందుగా స్పందించిన చంద్రబాబు 19 వ తేదీ అయితే తాను రాగలనంటూ కేంద్రానికి లేఖ రాశారు. కనీసం రెండు తేదీల ఆప్షన్‌ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ.. తెలంగాణ సీఎంకు ఛాయిస్‌ లేకుండా ఆయన చేశారు.

దానికి తగినట్లు కేసీఆర్‌ భిన్నంగా స్పందించారు. ఈ మూడు రోజులూ తనకు కుదరదని, 21వ తేదీ అయితే ఓకే అని లేఖ రాశారు. కేంద్రం ఏం మంతనాలు సాగించిందో గానీ.. చివరికి 21వ తేదీ భేటీని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరికి తను చెప్పిన తేదీకి కాకుండా, కేసీఆర్‌ నిర్ణయించిన తేదీకి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాలమూరు - డిండి ప్రాజెక్టుల గురించి రేగుతున్న గొడవపై ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో ఈ సమావేశంలో చర్చలు జరుగుతాయి. పట్టిసీమ నుంచి తమకు కూడా వాటా దక్కాలని తెలంగాణ అడుగుతున్నది. అయితే కేంద్ర జలసంఘానికి లేఖ రాయడం తప్ప ఈ ప్రాజెక్టులను వ్యతిరేకించడానికి ఇప్పటిదాకా చంద్రబాబు సర్కారు చేసినదేమీ లేదనేది ప్రజల్లో ఉన్న భావన. ప్రస్తుతం ఈ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కూడా.. ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంత రైతులు సుప్రీం కోర్టులో వేసిన కేసు పర్యవసానంగా జరుగుతున్నదే తప్ప.. ఏపీ ప్రభుత్వ చొరవతో జరుగుతున్నది కాదని జనం అనుకుంటున్నారు. మరి ఇలాంటి సమావేశంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News