చంద్రుళ్లిద్దరి కంబైన్డ్ యాక్షన్ ప్లాన్ !

Update: 2017-06-27 05:52 GMT
చాలా అంశాల్లో ఢీ అంటే ఢీ అనుకునే తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు ఒక విషయంలో మాత్రం కలిసి కట్టుగా ముందుకు సాగాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు ఢిల్లీలో మంతనాలు జరిపారని...  రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఇద్దరూ నిర్ణయించారని.. జూలై 17 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశ పెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే పునర్విభజనకు సమయం చాలదని ఇద్దరూ  అనుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
    
నియోజకవర్గాల పెంపు బిల్లును న్యాయవిభాగం ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రధాని కార్యాలయం ఆదేశాల కోసం కేంద్ర హోంశాఖ ఎదురుచూస్తోందన్న విషయాన్ని అధికారుల ద్వారా కేసీఆర్ కు తెలిసినట్లు చెప్తున్నారు. దీంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారట.  సీట్ల పెంపు గురించి తాను ఎప్పటికప్పుడు కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నానని... ఏదో ఒక టెక్నికల్ కారణం చూపి వాయిదావేస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ తో చంద్రబాబు అన్నట్లు వినిపిస్తోంది.  అంతేకాదు... మోడీ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించాలని కేసీఆర్ కు చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది.
    
రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ నామినేషన్ వేసే కార్యక్రమానికి హాజరైన సమయంలో ముఖ్యమంత్రులిద్దరి మధ్య ఈ అంశం చర్చకు వచ్చిందని.. ఇద్దరూ దీనిపై ఉమ్మడిగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారని మీడియాలో కథనాలు వచ్చాయి.  మొత్తానికి పార్లమెంటు సమావేశాల్లో రెండు టీడీపీ - టీఆరెస్ ఎంపీలు దీనిపై కలిసి కట్టుగా కదులుతారని అర్థమమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News