రెండు పెళ్లిళ్ల‌కు ఇద్ద‌రు చంద్రుళ్ల డుమ్మా!

Update: 2017-06-18 16:30 GMT
విభ‌జ‌న రెండు రాష్ట్రాల‌కే కాదు.. మాన‌వ సంబంధాలు కూడానా? అన్న సందేహం క‌లిగేలా తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల్ని చూస్తే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న‌ది తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో వినిపించిన మాట‌. కానీ.. విభ‌జ‌న రెండు తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య దూరాన్ని పెంచ‌కున్నా.. అధినేత‌ల్లో మాత్రం దూరాన్ని పెంచింద‌న్న సందేహం క‌లిగేలా ఉంది తాజా ప‌రిస్థితిని చూస్తే.

కాస్త అటూఇటూగా ఒకే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల పెళ్లిళ్లు జ‌రిగాయి. శ్రీకాకుళం ఎంపీ.. దివంగ‌త ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు పెళ్లి ఈ మ‌ధ్య‌న విశాఖ‌లో జ‌రిగింది. త‌న పెళ్లికి రావాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను క‌లిసి మ‌రీ రామ్మోహ‌న్‌ నాయుడు ఇన్విటేష‌న్ ఇచ్చారు. ఇక్క‌డ ఒక విషయాన్ని ప్ర‌స్తావించాలి.  తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కు.. రామ్మోహ‌న్ నాయుడు తండ్రి ఎర్రంనాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయ‌ని చెబుతారు. వారిద్ద‌రూ చాలా క్లోజ్ అంటారు. దీంతో.. పెళ్లికొడుకు స్వ‌యంగా వ‌చ్చి ఆహ్వానించ‌టంతో పెళ్లికి కేసీఆర్ వెళ‌తారేమో అన్న భావ‌న క‌లిగింది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ కుమారుడి పెళ్లి హైద‌రాబాద్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్లికి సంబంధించిన శుభ‌లేఖ‌ల్ని ఈటెల రాజేంద‌ర్ స్వ‌యంగా విజ‌య‌వాడ వెళ్లి మ‌రీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు ఇచ్చారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ రెండు పెళ్లిళ్ల‌కు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు త‌మ వారి ఫంక్ష‌న్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారే కానీ.. ప‌క్క రాష్ట్రంలో జ‌రిగిన వివాహానికి మాత్రం హాజ‌రు కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌కీయ ప్ర‌ముఖుల పెళ్లిళ్ల‌కు దాదాపుగా వెళ్ల‌టం ఉండేది. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఇద్ద‌రు చంద్రుళ్లు వారి రాష్ట్రంలోని వారి పెళ్లిళ్ల‌కే వెళ్ల‌టం ఆస‌క్తిక‌ర చ‌ర్చగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News