ఎన్నికల ఆటలో బాబు-పవన్ మోసపోయారట

Update: 2018-06-09 06:33 GMT
డోలు పోయి మద్దెలకు మొరపెట్టుకున్నట్టుంది చంద్రబాబు - పవన్ ల పరిస్థితి.. మోసం గురించి ఇప్పుడు ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఇస్తున్న డిఫెనెషన్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేశాకగానీ తాము మోసపోయిన విషయాన్ని గ్రహించిన వీరి నైజాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్నారు. అవకాశవాద రాజకీయాల కోసం విడాకులు తీసుకున్న వీరు ఇప్పుడు మోసపోయామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ప్రజల్లో మొసలి కన్నీరు కార్చడం అందరినీ విస్మయ పరుస్తోంది.

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి.. నిజమే ఇప్పుడు రాజకీయ నాయకులు అధికారం కోసం ఎవరిైనా చంపేస్తారు.. తాము చావడానికి వస్తే ఎదుటివారిని ఎంత దెబ్బకొట్టాలో అంతా కొడతారు.. ఇది చంద్రబాబు విషయంలో రుజువైంది.

తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని అయిన మోడీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. టీడీపీతో నాలుగేళ్లు దోస్తీ చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వనని మోడీ ముందునుంచి సరిగ్గానే చెప్పాడు. చంద్రబాబు కూడా దీనికి తలూపాడు.. హోదా సంజీవనా.? నిధులొస్తున్నాయి కదా.. హోదా గురించి అడిగితే జైల్లో పెడతాం.. అదీ అవసరం లేదంటూ ఘీంకరించారు. సరే ముఖ్యమంత్రియే హోదా వద్దంటున్నాడు కదా ప్రజలు కూడా ప్యాకేజీకి అంగీకరించారు. కానీ సీన్ రివర్స్ బాబు నాలుక మడతెట్టేశాడు.

ఇప్పుడు హోదా కావాలంటున్నాడు.. బీజేపీ మోసం చేసిందంటున్నాడు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది వేళ బీజేపీ చేతిలో మోసపోయాయని ఘోల్లు మంటున్నాడు. నిజానికి మోసం పోయింది బాబు కాదు.. ప్రజలు.. బాబు హోదా అక్కర్లేదని అన్నప్పుడు మోసపోయింది ప్రజలే.. బీజేపీ చేసింది మోసం కాదు.. వారు ముందునుంచి ఇవ్వమంటున్నా చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రభుత్వంలో కొనసాగి ఇప్పుడు ఓట్ల కోసం విడిపోయి బీజేపై ఫైట్ చేస్తున్నారు.

ఇక మన పవనాలు ఎంత వేగంగా వీచాడో.. ఇప్పుడు అంతే వేగంగా వీస్తున్నాడు. కానీ అప్పుడు టీడీపీ గాలి వీస్తే.. ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్నాడు. చంద్రబాబుపై ఈగ వాలనివ్వని పవన్ కళ్యాన్ ఇప్పుడు బాబునే తిడుతున్నాడు. బాబును గెలిపించాలంటూ గల్లీలు తిరిగి ఇప్పుడు ఓడించాలంటున్నారు. చంద్రబాబు మోసం చేస్తున్నాడంటున్నారు. హోదా ఇవ్వని బీజేపీని ఏమీ అనకుండా బాబుపై పడ్డాడు పవన్. వచ్చేసారి అధికారంలోకి రావాలంటే బాబే అడ్డంకి. అందుకే ఈ జనసేనాని కారణం లేకుండా తన ఆపాతమిత్రుడిపై అపనిందలు మోపుతున్నాడు. చంద్రబాబును నమ్మి మోసపోయానని పవన్ చెబుతున్నాడు. పవన్ కు కూడా నాలుగేళ్ల తర్వాత బాబు మోసం అర్థమవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.  బాబును నమ్మినప్పుడు ఈ విషయం పవన్ కు తెలియదా అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. నాలుగేళ్లుగా బాబును ప్రతి సందర్భంలో సమర్ధించిన పవన్. ఇప్పుడు మోసపోయామని జనం ముందు వాపోతున్నారు.

ఇలా ఇద్దరూ ముఖ్యనేతలు తాము మోసపోయామని ఒకరి నిందలు మరొకరిపై వేసుకుంటున్నారు. వచ్చే 2019 ఎన్నికల కోసం విడాకులు తీసుకొని సెంటిమెంట్ ను యాంటిమెంటుగా ప్రజలకు పూస్తున్నారు. వీరిని ప్రజలు ఆదరిస్తారా.? లేక తిరస్కరిస్తారా అన్నది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News