చంద్రబాబుతో రేవంత్ ‘క్విడ్ ప్రోకో’ ఫిక్సింగ్!

Update: 2017-11-04 17:30 GMT
రేవంత్ రెడ్డి - చంద్రబాబునాయుడు మీద అపరిమితమైన భక్తి ప్రేమానురాగాలను చాటుకుంటూ.. ఓ సుదీర్ఘమైన లేఖ రాసిన తర్వాతే.. కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు. ఈ సందర్భంగా రెండు సార్లు చంద్రబాబుతో ‘ఆంతరంగిక’ మంతనాలు కూడా సాగించారు. ‘‘నేను విడిగా మాట్లాడడానికి ఇష్టపడను’’ అని చెబుతూనే చంద్రబాబునాయుడు రేవంత్ తో ఏకాంతంగా రెండుసార్లు మాట్లాడారు. మొత్తానికి ఇప్పుడు తాజాగా నెలకొన్న పరిస్థితుల్ని చూస్తోంటే వారిద్దరి మధ్య ఒక క్విడ్ ప్రోకో ఒప్పందం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. రాజీనామా వల్ల నా పదవి పోకుండా నువ్వు కాపాడు- ఓటుకు నోటు కేసులో నీ పేరు బయటపెట్టకుండా నేను కాపడతా.. అనేదే ఆ ఒప్పందం లాగా కనిపిస్తోంది. అందుకే బహుశా రేవంత్ రాజీనామా చేసి వారం పైగానే గడుస్తున్నా తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు తనవద్దకు వచ్చిన రాజీనామా లేఖను, సంబంధిత తెలంగాణ స్పీకరుకు పంపడానికి ఇంకా చొరవ చూపించడం లేదనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి.

ఆ రకంగా ఆ కోణంలోంచి జరిగిన పరిణామాల్ని గమనించినప్పుడు అంతా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. రేవంత్ రెడ్డి చాలా ఘనంగా, నిజాయితీ పరుడిలాగా తన పదవికి రాజీనామా చేసేశారే గానీ.. ఆయన ఆ లేఖను తీసుకెళ్లి చంద్రబాబునాయుడు చేతిలో పెట్టారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన పార్టీ రాజీనామా లేఖను ఆయనకు ఇచ్చి, ఎమ్మెల్యేగిరీకి రాజీనామా లేఖను ఇక్కడ స్పీకరు చేతికి ఇచ్చి ఉంటే అంతా చాలా సబబుగా ఉండేది. కానీ అలా జరగలేదు. రాజీనామా విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ.. ఇప్పుడు అసలు అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. రాజీనామా చేసినట్టే ఉండాలి.. కానీ పదవి పోకూడదు.. అలా జరగాలంటే.. చంద్రబాబు సహకారం ఉండాలి... అలా ఉండాలంటే ఆయనతో క్విడ్ ప్రోకో ఒప్పందం ఉండాలి.. అన్నట్లుగా రేవంత్ పావులు కదిపినట్లు కనిపిస్తోంది.

రేవంత్ రాజీనామా చేశారే తప్ప.. ప్రస్తుతానికి ఆయన ఉప ఎన్నికను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యూహం ప్రకారం ఆయన వెళ్లి ఉండొచ్చు. ఈ చంద్రబాబు భక్తుడికి ఆయన ఆశీస్సులు పుష్కలంగానే ఉంటాయి గనుక.. అది స్పీకరు దాకా ఇప్పట్లో వెళ్లే అవకాశం  కూడా ఉండదని, ఉప ఎన్నిక జరపాల్సిన అవసరం లేదు అని ఎన్నికల కమిషన్ భావించే పరిస్థితి వచ్చిన తర్వాతే.. అది స్పీకరు వరకు చేరగలదని కూడా పలువురు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News