బాబుకు యాంటీగా టీడీపీ నేత‌లు

Update: 2016-10-20 22:30 GMT
ఔను.. ఇప్పుడు టీడీపీలో ప‌రిస్థితి ఇలానే ఉంది! త‌న మాట‌కు ఎవ‌రూ ఎదురుచెప్ప‌ర‌ని భావించే ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సొంత పార్టీ నుంచే త‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే నేత‌లు బ‌య‌ల్దేరారు. అయితే, ఈ ప‌రిణామం అన్ని విష‌యాల్లోనూ కాదులేండి! త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల విష‌యంలోనే! బాబు ఓ విధంగా ప్లాన్ చేస్తుంటే టీడీపీ మంత్రులు మ‌రో విధంగా వెళ్దామ‌ని బాబుపై ఒత్తిడి తెస్తున్నార‌ట. ఈ నేప‌థ్యంలోనే మంత్రులు చెప్పిన సూచ‌న‌ల‌ను కూడా బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ విష‌యం ఏంటో చూద్దాం..

రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. గ‌తంలో ఈ విష‌యంపై హైకోర్టులో జ‌రిగిన వాద‌న‌ల సంద‌ర్భంగా న‌వంబ‌ర్ నెలాఖ‌రులోపు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కోర్టుకు చెప్పింది. ఈ క్ర‌మంలో మొత్తంగా రాష్ట్రంలోని  ఆరు కార్పొరేషన్‌ లు - అయిదు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార టీడీపీకి - అటు విప‌క్ష వైకాపాకి కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. తాము అధికారంలోకి వ‌చ్చి దేశంలో ఏ ప్ర‌భుత్వమూ చేప‌ట్ట‌న్న‌న్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని, సామాజిక ఫింఛ‌న్ల పెంపులో అగ్ర‌స్థానంలో ఉన్నామ‌ని, నిరంత‌ర విద్యుత్ విష‌యంలోనూ పుంజుకున్నామ‌ని కాబ‌ట్టి ప్ర‌జ‌లు మా వెంటే ఉన్నార‌ని చంద్ర‌బాబు అంటున్నారు. దీనికి రాబోయే మునిసిప‌ల్ ఎన్నిక‌లే నిద‌ర్శ‌నంగా మార‌తాయ‌ని ఆయ‌న చెబుతున్నారు.

అయితే, విప‌క్ష వైకాపా మాత్రం చంద్ర‌బాబు నిరంకుశ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా? ఎప్పుడెప్పుడు చంద్ర‌బాబుకు - ఆయ‌న పార్టీకి బుద్ధి చెబుదామా అని ఎదురు చూస్తున్నార‌ని అంటోంది. ఈ క్ర‌మంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావించాల‌ని ఇప్ప‌టికే టీడీపీకి స‌వాలు విసిరింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని, 2014 నాటి ప్ర‌జాద‌ర‌ణ పావ‌లా వంతు కూడా త‌గ్గ‌లేద‌ని నిరూపించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇదే విష‌యాన్ని పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో చ‌ర్చించారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు వెళ్దామ‌ని చంద్ర‌బాబు అన్నారు. అయితే, టీడీపీ మంత్రులు మూకుమ్మ‌డిగా ఈ ప్ర‌తిపాద‌న‌ను తిప్పికొట్టారు.

 చైర్మన్ - మేయర్ పదవులకు పరోక్ష ఎన్నికలైతేనే మేలని మంత్రులు అంటున్నారు. ఫ‌లితంగా అన్ని చోట్లా టీడీపీ పాగా వేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.  ఏదైనా కార్పొరేషన్ లేదా పురపాలక సంఘంలో ఒకటి - రెండు సీట్లు తక్కువ వచ్చినా ఇండిపెండెంట్లు లేదా ప్రత్యర్ధి పక్షంవారిని తమ వైపునకు తిప్పుకుని అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవచ్చ‌ని వారు చెబుతున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌పై చంద్ర‌బాబు ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అయితే, దీనిపైనా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఇక‌, ఈ ప్ర‌త్య‌క్ష‌ - ప‌రోక్ష విష‌యంలో ఏదో ఒక క్లారిటీ వ‌స్తేనే.. ఎన్నిక‌లు షురూ అయ్యేది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News