కేసీయార్ స్వీట్...జగన్ హాట్...?

Update: 2022-04-16 17:04 GMT
రెండు కళ్ళ సిద్ధాంత కర్త చంద్రబాబు.కళ్ళు రెండు కానీ చూపు ఒక్కటే.కానీ చంద్రబాబు రెండు కళ్ళూ రెండు వైపులా చూడగలవని తెలంగాణా ఉద్యమ కాలంలో గట్టిగా నిరూపించారు. ఇపుడు కూడా అయనది అదే రూట్. ఎందుకంటే అది బెటర్ కాబట్టి. ఏపీకి సీఎం గా అయిదేళ్లు పాలించిన బాబు మూడేళ్ళుగా మాజీగా కాపురం ఉంటున్నది తెలంగాణాలో. దాంతో ఆయన రెండు కళ్ళూ పెట్టి అటూ ఇటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఇక తెలంగాణాలో ఇప్పటిదాకా టీడీపీ రంజైన  రాజకీయం చేయడం లేదు కాబట్టి కేసీయార్ తో పేచీ పూచీ లేదు. అందుకే ఆయన వెరీ స్వీట్ గా కనిపిస్తున్నారు. దాంతో బాబు రీసెంట్ గా మరోసారి ఒకనాటి తన సహచరుడైన కేసీయార్ ని పొగిడారు. తెలంగాణా టీడీపీ  నాయకులతో నిర్వహించిన సమావేశంలో తన అభివృద్ధి ఈ రోజు బ్రహ్మాండంగా తెలంగాణాలో కనిపిస్తోంది అని చంద్రబాబు మురిసిపోతున్నారు. తాను చేసిన దాన్ని తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎక్కడా చెడగొట్టలేదని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు.

అంటే ఆయన తరువాత వచ్చిన వైఎస్సార్,కేసీయార్ బాబు మార్క్ డెవలప్మెంట్ ని అలా ఉంచేశారు అన్న మాట. దాంతో సైబరాబాద్ అన్నా మరోటి అన్నా హైటెక్ సిటీ అన్నా బాబు గుర్తుకువస్తున్నారు అన్నదే ఆయన సంబరం.అదే ఏపీలో చూసుకుంటే చంద్రబాబు అమరావతి పేరిట అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించాలనుకున్నారు. దానికి డిజైన్లు అవీ రెడీ చేసి పెట్టారు. ఈ లోగా ఆయన దిగిపోయి జగన్ రావడంతో అమరావతి కాస్తా కల చెదిరింది, కధ మారింది అన్నట్లుగా తయారైంది.

దాంతో చంద్రబాబు ఏపీని, అందునా అమరావతిని తలచుకుని బాధపడని రోజంటూ లేదని అంటారు. తాను చేసిన దాన్ని కొనసాగించకుండా జగన్ మూడు అంటూ ముచ్చెరువుల నీళ్ళు తాగించే రాజకీయాన్ని చేయడాన్ని సీనియర్ మోస్ట్ నేత తట్టుకోలేకపోతున్నారు.బాబు ఈ విషయంలో బాగా హర్ట్ అని అంటున్నారు. ఆయనకు అమరావతి మానసపుత్రిక వేదన రోదనా మేలుకున్నా నిద్రపోయినా మూడేళ్ళుగా వస్తూనే ఉందిట.

దాంతో జగన్ మీద కోపం తన్నుకువస్తోంది. అదే టైమ్ లో కేసీయార్ అంటే అభిమానమూ పుట్టుకువస్తోంది.అయితే చంద్రబాబు ఇక్కడ మరచిన విషయం ఒకటి ఉంది. హైదరాబాద్ బాబు కట్టలేదు, ఎవరూ కట్టలేరు కూడా అది నాలుగు వందల ఏళ్ల నాటి నగరం. ఇక బాబు దానికి మరి కొంత సొగసు అద్దారు.దాన్ని పెంచుకుపోవడం తరువాత వచ్చిన వారికి కూడా కష్టమూ కాదు, నష్టమూ లేదు.

అదే అమరావతి అలా కాదు కదా. ఆ మాటకు వస్తే అక్కడ రాజధాని అంటూ లేనే లేదు కదా.ఇంకా ఊహల్లోనే ఉన్న అమరావతి రాజధానిని  జగన్ వచ్చి చెదరగొట్టారు. ఆయన తనదైన కలలు మూడు రాజధానులలో చూసుకుంటున్నారు. సో బాబు ఊహలు అలా చెదిరాయి తప్ప నిజంగా అమరావతిలో పాడు అయింది ఏముంది అన్న చర్చ కూడా ఉంది.

ఏదైనా ఒక రూపూ షేపూ వస్తే ఎవరూ కోరి చెడగొట్టాలనుకోరు. అలా వీలు ఉండదు కూడా.జనాలే ముందు తిరబడతారు.ఏతా వాతా తేలేది ఏంటి అంటే బాగున్న చోట మనమూ ఒక చేయి వేసి అంతా ఒకే అనేసుకోవచ్చు. కానీ పునాదుల నుంచి లేపేదాంట్లో మాత్రం అసలైన కష్టాలు చూడాలి.అక్కడే తేడా కొడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే సడెన్ గా కేసీయార్ మీద అభిమానం ఎందుకొచ్చిందబ్బా. ఇది పెద్ద ప్రశ్న. జగన్ మీద ఎటూ కోపం ఉంది కాబట్టి ఆయన హాటే మరి.
Tags:    

Similar News