వలసలు ఆపలేక ఇంటెలిజెన్స్‌ పై చంద్రబాబు గుస్సా

Update: 2019-02-19 16:36 GMT
ఎమ్మెల్యేలు - ఎంపీలు ఒక్కరొక్కరుగా టీడీపీని వీడుతుంటే చంద్రబాబునాయుడికి ముచ్చెమటలు పడుతున్నాయి. చేతికి ఎముకలేని దాతలా అడిగినోళ్లకు అడిగినంత అన్నట్లుగా హామీలు ఇచ్చుకుంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నవేళ పార్టీ నేతలు ఇలా ఢోకా ఇస్తుంటే ఏం చేయాలో తోచక చంద్రబాబుకు బీపీ పెరిగిపోతోందట. ఇంకా ఎంతమంది వెళ్తారు? ఏం చేస్తే ఆగుతారు అనేది ఏమాత్రం తెలియడం లేదని కంగారు పడుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషనంతా కలిసి ఏకంగా ఇంటిలిజెన్స్ డిపార్టుమెంట్‌పై చూపించారనేది అమరావతి సర్కిళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్.
   
కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు - ఇద్దరు ఎంపీలు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. రెండు రోజుల ముందు ధర్మపోరాట దీక్షలో తన పక్కనే నిల్చున్న ఎంపీలు కూడా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో చంద్రబాబు షాక్ తిన్నారట. ముందే తమకు తెలుసంటూ, ఎవరెళ్లినా ఏం కాదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం సమాచారం ఏమీ తెలియడం లేదన్న కంగారు మొదలైందట చంద్రబాబుకు.
   
దీంతో ఇంటిలిజెన్స్ ని  పిలిచి ఫుల్లుగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అసలేం జరుగుతోందో తెలియడం లేదని - ఎమ్మెల్యేలు - ఎంపీలకు తాను ఫోన్ చేసినా తీయడం లేదని.. పరిస్థితులు ఇంత దారుణంగా మారినా ఇంతవరకు ఎందుకు గుర్తించలేకపోయారు.. ఇలా అయితే - ఎన్నికలకు ఎలా వెళ్తామంటూ చంద్రబాబు ఫుల్లుగా క్లాస్ పీకారట. వైసీపీ ఏం చేస్తోంది..ఎవరికి ఎర వేస్తోంది.. ఎవరు ఎలాంట అడుగులు వేస్తున్నారో తెలుసుకోకపోతే ఇంటెలిజెన్స్ ఇంకెందుకంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.
   
అయితే... చంద్రబాబు తిట్లన్నీ మౌనంగా భరించిన ఇంటెలిజెన్సు అధికారులు బయటకొచ్చాక మాత్రం చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారట. సీబీఐ వస్తుందా.. ఈడీ అధికారులు వస్తున్నారా.. ఐటీ అధికారులు మనపై కన్నేశారా.. ఎవరిపైనైనా దాడులు జరిగే అవకాశం ఉందా... బీజేపీ నేతలు నాపై ఎలాంటి కుట్రలు చేస్తున్నారా... జీవీఎల్ కదలికలేంటి.. మోదీ నన్నేమైనా టార్గెట్ చేశారా.. కేసీఆర్ ఏపీలో ఏం చేయబోతున్నారు.. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉండొచ్చన్న సమాచారం తెప్పించుకునే పనిలోనే తమను ఇంతకాలం ఉంచారని.. పూర్తి అభద్రతతో ఇలాంటి అనవసర విషయాల కోసం ఇంటెలిజెన్సును వాడుకుని ఇప్పుడు పార్టీలో నాయకుల గురించి అడిగితే ఏం చెప్తామని డిపార్టుమెంటువారు అనుకుంటున్నారట.
   
Tags:    

Similar News