మీటింగ్‌ లో మంత్రుల్ని చేతులెత్త‌మ‌న్న సీఎం

Update: 2018-07-07 04:59 GMT
బాబు నేతృత్వంలో నిర్వ‌హించిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఒక అంశంపై జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రులు ఏమ‌నుకుంటున్నారు?  వారి స్పంద‌న ఏమిట‌న్న విష‌యాన్ని తెలుసుకునేందుకు వీలుగా.. చేతులు ఎత్తాలంటూ బాబు కోర‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మంత్రులు చేతులెత్తి త‌మ అభిప్రాయం తెలిపే ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది చూస్తే..

ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం తాజాగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీకి  ఇవ్వాల‌ని పేర్కొన్న వాటిపై కేంద్రం ఇస్తున్న స‌మాధానాల‌పైనా.. ఈ ఇష్యూలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపైనా సీఎం చంద్ర‌బాబు.. మంత్రులు అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పోల‌వ‌రం సంద‌ర్శ‌న కోసం వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న వెంట సీఎం బాబు వెళ్లాలా?  వ‌ద్దా? అన్న‌ది చ‌ర్చ‌గా మారింది.

గ‌డ్క‌నీ వెంట ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ప‌ర్య‌టించే వీలుంద‌న్న మాట వినిపిస్తోంది. గడ్క‌రీ వెంట క‌న్నాతో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు వెళుతున్నార‌ని.. అదేదో పార్టీ మీటింగ్ లా ఉంటుందే త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దని.. అలాంట‌ప్పుడు ముఖ్య‌మంత్రి వారి వెంట వెళితే బాగుంటుందా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది.

గ‌డ్క‌రీ వెంట సీఎం బాబు వెళ్లే విష‌యంపై ఏకాభిప్రాయం లేక‌పోవ‌టంతో.. గ‌డ్క‌రీతో వెళ్లాలా?  వ‌ద్దా? అన్న అంశంపై చేతులెత్తే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. గ‌డ్క‌రీ వెంట బాబు వెళ్లాల‌న్న దానికి మ‌ద్ద‌తు ఇచ్చే వారెంద‌రు? అన్న బాబు మాటతో మంత్రులు గంటా.. ఆది.. అచ్చెన్నాయుడు మిన‌హా మిగిలిన వారంతా చేతులు ఎత్తార‌ట‌. మెజార్టీ స‌భ్యులు గ‌డ్క‌రీతో పాటు వెళ్లాల‌న్న అంశానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌టంతో.. తాను ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని బాబు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌డ్క‌రీ వెంట క‌న్నా ఉన్నా.. అది అధికారిక కార్య‌క్ర‌మం కావ‌టంతో ముఖ్య‌మంత్రి బాబు వెళ్ల‌టం త‌ప్పు కాద‌న్న మాట‌ను మంత్రులు చెప్పారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. చేతులెత్తి ఓటింగ్ నిర్వ‌హించిన త‌ర్వాత‌.. త‌మ్ముళ్లు త‌మ అభిప్రాయాన్ని చెప్పినా.. తానేం అనుకుంటున్న విష‌యాన్ని చెప్ప‌కుండా త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటాన‌ని వేరే అంశంలోకి వెళ్లిపోయార‌ట‌.
Tags:    

Similar News