టీ త‌మ్ముళ్ల కోసం బాబు కొత్త నిర్ణ‌యం

Update: 2016-11-28 04:29 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ప‌ది నెల‌ల త‌ర్వాత స‌మ‌యం కేటాయించిన ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల్లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు. స‌భ్య‌త్వ న‌మోదు నేప‌థ్యంలో పార్టీ కార్యాల‌యంలో స‌మావేశ‌మైన చంద్ర‌బాబును తెలంగాణ నేత‌లంతా స‌మ‌యం కేటాయించాల‌ని కోరారు. సభకు అధ్యక్షత వహించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ తమకు ధైర్యాన్ని నూరిపోయాలని చంద్రబాబును కోరారు. సీఎం కేసీఆర్‌ ను - టీఆర్ ఎస్‌ ను ఎదుర్కునేందుకు పార్టీ అండ ఉండాల‌న్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు - మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్ని జన్మలెత్తినా ఇటువంటి నాయకుడు లభించరన్నారు. చంద్రబాబు నెలకు ఒకసారైనా పార్టీకి సమయం కేటాయించాలని, బాబువస్తే ‘టానిక్’ ఇచ్చినట్టే అవుతుందన్నారు. పార్టీ తెలంగాణ నేతలు ఎవరి దారిన వారు వెళ్ళకుండా అందరినీ కలుపుకుని పోవాలన్నారు. తెలంగాణలో పెత్తందార్ల రాజ్యం రాకూడదంటే మీరు సమయం కేటాయించాలని కోరారు.

అనంత‌రం మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు ఇక్కడే (తెలంగాణలో) ఉండిపోవాలని ఉంది అని  వ్యాఖ్యానించారు. మనసు ఇక్కడేవున్నా, అక్కడ (ఏపీలో) బాధ్యతలు ఉన్నాయన్నారు. ఏపీ కంటే బలమైన నాయకత్వం తెలంగాణలో ఉందనడంతో పార్టీ నేతలు కరతాళ ధ్వనులు చేశారు. పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాలని, తాను పూర్తిగా అండగా ఉంటానని చంద్ర‌బాబు చెప్పారు. పార్టీ నేతలు కొందరు తనను నెలకు ఒక్క రోజైనా తెలంగాణకు కేటాయించాలని కోరారని, అయితే అంతకంటే ఎక్కువ సమయమే కేటాయిస్తానని చెప్పి వారికి ధైర్యం కల్పించే యత్నం చేశారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేశామని, ఇలా చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే రెండు లక్షల ఆర్థిక సాయం నిధినుంచి అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో ఏపీలో 5 లక్షలతో చంద్రన్న భీమా ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు.

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం కొతులకు ఇచ్చినట్టుందని విమర్శించారు. 19 ఎకరాల్లో ముఖ్యమంత్రి తన సొంతానికి 9 ఎకరాల్లో విలాసవంతమైన 150 గదుల గడిని నిర్మించుకున్నారని - మిగతా ఎకరాల్లో కౌన్సిల్ చైర్మన్ - అసెంబ్లీ చైర్మన్ - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భవనాలు నిర్మించారని తెలిపారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత 16మంది సీఎంలు 69 వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తే, కేసీఆర్ లక్షా 25 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. టీడీపీని ఆంధ్ర పార్టీ అంటే సహించేది లేదని - టీడీపీ తెలంగాణలోనే పుట్టిందని అన్నారు. త్వరలో మహారాష్ట్ర, కర్నాటక - ఒరిస్సా రాష్ట్రాలకూ పార్టీని విస్తరించనున్నట్లు రేవంత్‌ వెల్లడించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే తమస్థాయి తగ్గించుకున్నట్టే అవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News