జన జాగృతి ... బాబు చలవేనా...!?

Update: 2018-08-25 06:11 GMT
ప్రజాసౌమ్యంలో కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకోవడం సహజమే. ఏ కొత్త  రాజకీయ పార్టీయైన తొలి రోజులలో పురిటి కష్టాలు పడడమూ సహజమే. అయినా దేశంలో కొత్త రాజకీయ పార్టీలు అవతరించడం జరుగుతూనే ఉంది. తాజగా ఆంధ్రప్రదేశ్‌ లో మరొక కొత్త పార్టీ పుట్టింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఈ పార్టీని ప్రకటించారు. వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ తరఫున అరకు లోక్‌ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్తపల్లి గీత అధికార తెలుగుదేశం పార్టీ పన్నిన ఉచ్చులో పడ్డారు. వారి మాయ మాటలతో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్‌ కు దూరమయ్యారని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి దగ్గరైన తర్వాత కొత్తపల్లి గీతకు అక్కడున్న లోటుపాట్లు తెలిసాయని, తాను తప్పు చేశానని భావించిన ఆమె ఇక తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉన్నారు. అయితే తిరిగి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావించినా కొత్తపల్లి గీతకు అహం అడ్డు రావడంతో ఆమె ఎవరి చెంతకు వెళ్లకుండా ఇన్నాళ్లూ కాలం గడిపారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆ పార్టీలో చేరతారు... పవన్ కల్యాణ్ ను కలిసారు వంటి వార్తలు హల్ చల్ చేశాయి. అయితే కొత్తపల్లి గీత మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా స్వతంత్రంగానే ఉండిపోయారు. దీనికి ఆమెను అభినందించిన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఆమె ధైర్యానికి చాలా మంది అభినందించారు కూడా. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారో అని అరకు ప్రజలే కాదు... ఆంధ్రప్రదేశ్‌ లో అందరూ ఎదురు చూశారు. చివరి క్షణంలో ఆమె జన జాగ్రతి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

 ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు రావడాన్ని స్వాగతించాల్సిందే. అయితే మహిళ... అందునా గిరిజన మహిళ అయిన కొత్తపల్లి గీత ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేసిన జన జాగ్రతి పార్టీ ప్రజల్లోకి ఎంత వరకూ వెళ్తుందనేదే పెద్ద ప్రశ్న. అండ బలం - అర్ధ బలం దండిగా ఉన్న వారే నిలదొక్కుకోలేని నేటి రాజకీయ వ్యవస్ధలో కొత్తపల్లి గీత ఏర్పాటు చేసిన పార్టీ మనుగడపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు కూడా రోజుకో పార్టీ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో జన జాగ్రతిని ఎంత వరకూ ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్న. అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడే కొత్తపల్లి గీత చేత పార్టీ పెట్టించి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని ఏజెన్సీ గ్రామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి నానాటికి బలం పెరుగుతోంది. ఏజెన్సీలలో గిరిజనులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులవుతున్నారని ఇంటిలిజెన్సి నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గిరిజనుల ఓట్లలో చీలిక తెచ్చేందుకు చంద్రబాబు నాయుడే ఈ కొత్త పార్టీ వెనుక ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏమో.... చంద్రబాబు నాయుడు దేనికైనా సమర్ధుడని - చేపినా చేయవచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ లో మరో కొత్త అమాయకపు రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది.



Tags:    

Similar News