ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఈ వారంలోనే?! ​

Update: 2017-02-08 05:56 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను క్యాబినెట్‌ లోకి తీసుకోవటం ఖాయమైన నేప‌థ్యంలో ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై అంద‌రి దృష్టి ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు అంటున్నాయి. ఆ మేరకు ముఖ్యమంత్రి - పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 9 -10 - 11వ తేదీల్లో విస్తరణకు ముహుర్తంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల గవర్నర్‌ ను కలిసిన సందర్భంలో తన మనసులోమాట బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే 16వ తేదీలోగా విస్తరణ చేపట్టడం ఖాయమంటున్నారు.

తెలుగుదేశం పార్టీలోని కీల‌క‌వ‌ర్గాల సమాచారం ప్రకారం.. మరో మూడు - నాలుగురోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పార్టీ యువ‌నేత లోకేష్ తో పాటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకూ మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఆయన మరదలు, ప్రస్తుత మంత్రి మృణాళినిని తొలగించి, ఆమె స్థానంలో కళాను తీసుకోనున్నారని చెప్తున్నారు.  ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పను తొలగించి, కళా వెంకట్రావు స్థానంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చంటున్నారు. చినరాజప్ప స్థానంలో అదే జిల్లాకు చెందిన కాపునేత జ్యోతుల నెహ్రుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వవచ్చంటున్నారు. జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు రెడ్డి సామాజికవర్గానికి ఈసారి ప్రాధాన్యం లభించనుంది. అందులో భాగంగా, పదేళ్లు ప్రతిపక్షంలో వైఎస్ పైనా, గత రెండున్నరేళ్ల నుంచి జగన్‌ పై విమర్శల దాడి చేస్తున్న సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి క్యాబినెట్‌ లో అవకాశం దక్కనుందని అంచ‌నా. అదే నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి నారాయణను తొలగించి, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చైర్మన్‌ గా వ్యవహరిస్తున్న సీఆర్‌ డీఏకు చైర్మన్‌ గా నియమించవచ్చని చెప్తున్నారు.

ప్రస్తుత మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డిలను కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలతో పార్టీ నష్టపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన తొలగింపుపై ఫిఫ్టీ-ఫిఫ్టీ అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఆయనను తొలగిస్తే, అదే సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చాన్స్ దక్కవచ్చంటున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత కొనసాగింపు ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఉంది. ఆమెపైనా అనేక ఆరోపణలున్నప్పటికీ, శాఖ మారుస్తారే తప్ప పదవి నుంచి తప్పించరని కొందరు, ఆమె స్థానంలో అదే సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం ఇస్తారని మరికొందరు చెబుతున్నారు. అదే జరిగితే విశాఖ జిల్లా నుంచి దళిత ఎమ్మెల్యే అనితకు అవకాశం లభించవచ్చని, మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈసారి ప్రాధాన్యం తగ్గించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ బీసీల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శెట్టిబలిజకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణకు అవకాశం లభించవచ్చు. అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర కొనసాగింపు పైనా సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ఆయనను తొలగిస్తే అదే వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత కొండబాబుకు అవకాశం దక్కవచ్చు. ఇక మంత్రివర్గంలో యనమల ఒక్కరే యాదవుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్నందున, జనాభా అధికంగా ఉన్నందున మరోయాదవకు చాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేవంటున్నారు. రాయలసీమ చుట్టూ ఉన్న ఆరు జిల్లాల్లో ఇప్పటివరకూ కెఇ కృష్ణమూర్తి ఒక్కరే బీసీ కోటాలో ఉన్నందున, నెల్లూరు జిల్లా నుంచి యువనేత, జిల్లా పార్టీ అధ్యక్షుడైన బీదా రవిచంద్రకు యాదవ్‌ కు  కోటాలో అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కెఇ శాఖ మార్చవచ్చంటున్నారు.గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిశోర్‌ బాబుపై వేటు ఖాయమంటున్నారు. ఆయన చర్యలతో పార్టీ ఇప్పటికే భ్రష్ఠుపట్టిపోయిందన్న ఆగ్రహం నాయకత్వంలో ఉంది. ఆయనను తొలగిస్తే మాదిగ సామాజికవర్గం నుంచి ఎవరూ లేనందున, ఆయన స్థానంలో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత వర్ల రామయ్యను తీసుకుని, తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారా చూడాల్సి ఉంది.

అయితే జంప్ జిలానీ ఎమ్మెల్యేల విష‌యంలో మాత్రం గ‌తంలో ఉన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి పార్టీలో చేరిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా అన్న మీమాంస కొనసాగుతోంది. మాట ఇచ్చినందున దానిని నిలబెట్టుకోవాలని భావిస్తే మాత్రం ఆ కోటా నుంచి రెడ్డి వర్గంలో భూమా అఖిలప్రియకు అవకాశం దక్కవచ్చు. చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్‌రెడ్డికి కూడా అవకాశం ఉందంటున్నారు. విజయనగరం నుంచి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. ఇక అనంతపురం జిల్లా నుంచి చాంద్‌షాషాకు పదవిపై చర్చ జరుగుతోంది. మైనారిటీలకు అవకాశం ఇచ్చే సందర్భంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, బాబుకు అత్యంత విధేయుడైన ఎం.ఏ.షరీఫ్ పేరు కూడా పరిశీలనలో ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News