బాబుగారూ ఇలాగైతే ఏం కాపాడతారు సార్!

Update: 2017-11-07 04:23 GMT
రాజకీయ నాయకులు అంటేనే.. ఏ రోటికాడ ఆ పాట పాడే రకం. అవసరం కోసం మాట్లాడుతుంటారు తప్ప.. చిత్తశుద్ధితో మాట్లాడుతుంటారని నమ్మితే మనం పప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం చంద్రబాబునాయుడు కూడా అలాంటి ఒక ప్రసంగం చేసేశారు. తెలుగుభాషను మనందరం కలిసి పరిరక్షించుకోవాలని సూచించేశారు. ఇంట్లో ఆఫీసుల్లో మనం మొత్తం తెలుగు మాట్లాడాలని కూడా క్లాస్ తీసుకున్నారు. అయితే భాషను కాపాడడం కోసం ఇలాంటి ప్రసంగాలు ఆయన గతంలో కూడా చాలా చేశారు. అయితే అన్నీ భాషకు సంబంధించిన ఉద్యమాలు - సభల్లో చేసినవే. భాషను కాపాడడం గురించి.. ఆయన ఏనాడూ ఒక కేబినెట్ మీటింగులో గానీ.. మరొక యూనివర్సిటీలో యువతను ఉద్దేశించి గానీ చెప్పిన పాపాన పోలేదు. అంటే.. భాషా వేదికల మీద మాత్రమే ఆయన భాషా ప్రేమను ప్రదర్శిస్తారన్నమాట. ఇలాగైతే ఆయన భాషను ఎలా రక్షిస్తారు అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

అదే చంద్రబాబు గారు.. గతంలో అమరావతి పేరు చెప్పి జపాన్ సంబంధాలు నెత్తిన పెట్టుకుని కొన్నాళ్లు ఊరేగారు. ఆ రోజుల్లో ఆయన ప్రతి యూనివర్సిటీకి తిరిగి ఇక్కడ యువతరానికి జపాన్ లో ఉద్యోగాలు వచ్చేస్తాయని అందరూ జపనీస్ భాష నేర్చుకోండి అని నానా కబుర్లు చెప్పారు. మన యూనివర్సిటీల్లో జపనీస్ డిపార్టుమెంట్లు పెట్టించారు. జపాన్ వ్యాపారుల్ని - పెట్టుబడిదారుల్ని - నగర నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. వారిని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. అయినా.. జపాన్ వ్యాపారుల్ని ఇక్కడకు ఆహ్వానిస్తూ.. అయ్యా ఇక్కడ తమరు వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించాలంటే.. తెలుగు నేర్చుకోండి అని చంద్రబాబు చెబితే.. దాని వల్ల ప్రయోజనం ఉంటుంది గానీ.. ఇక్కడ మన తెలుగు రాజధానిలో కూలి పనులు - ఉద్యోగాలు చేసుకోవడానికి మనల్ని జపనీస్ నేర్చుకోమని ఎందుకు చెప్పారో అర్థం కాదు.

ఇలా తనకంటూ భాషమీద చిత్తశుద్ధిని ఏనాడూనిరూపించుకోలేని చంద్రబాబునాయుడు.. భాషా వేదికల మీద మాత్రం ప్రేమ  - సందేశాలు కురిపిస్తుంటారు. కనీసం ప్రభుత్వాదేశాలు - జీవోలు అన్నీ తెలుగులో ఉండాలనే, ప్రజలకు అర్థమయ్యే భాషలో తయారు కావాలనే ఆదేశాన్ని ఆయన తయారు చేయగలరా? అనేది పలువురిలో మెదలుతున్న ప్రశ్న.
Tags:    

Similar News