కొడాలి నానిపై బాబు కామెంట్స్‌!..భ‌యం గురుతులేనా?

Update: 2019-03-29 16:53 GMT
ఎన్నిక‌ల పోలింగ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిలో అస‌హ‌నం పెరిగిపోతున్న వైనం చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఏపీ ఎన్నిక‌ల‌తో ఏమాత్రం సంబంధం లేని టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల‌పై వ‌రుస‌గా విరుచుకుప‌డుతున్న చంద్ర‌బాబు... తాజాగా క్శ‌ష్ణా జిల్లా గుడివాడలో నిర్వ‌హించిన ప్ర‌చారంలో భాగంగా అక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యే - వైసీపీ కీల‌క నేత కొడాలి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)పై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పించారు. గుడివాడ లోక‌ల్ అని చెప్పుకునే నానిని ఉద్దేశించి... అస‌లు ఎక్క‌డ పుట్టారు? ఎక్క‌డ పెరిగారు? అంటూ లోకల్ - నాన్ లోక‌ల్ ఫీలింగ్ తెచ్చే య‌త్నం చేశారు. నానిని నాన్ లోక‌ల్ అంటూనే... నిజంగానే నాన్ లోక‌ల్ అయిన టీడీపీ అభ్య‌ర్థి దేవినేని అవినాశ్ ను లోకల్ గా చూపే య‌త్నం చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

నానిపై విమ‌ర్శ‌ల జ‌డిని కొన‌సాగించిన చంద్ర‌బాబు... సొంత పార్టీకే ద్రోహం చేసిన వ్య‌క్తిగా ఆయ‌న‌ను చంద్రబాబు అభివ‌ర్ణించారు. తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే వ్య‌క్తి అని నానిని దుయ్య‌బ‌ట్టారు. అలాంటి నానిని క్ష‌మించటానికి వీల్లేద‌ని - అటువంటి దుర్మార్గుడిని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని గుడివాడ వాసుల‌కు పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో డ‌బ్బు మూటల‌తో వ‌స్తాడని..ఆ త‌రువాత వ్యాపారం చేసుకుంటాడ‌ని కూడా నానిపై నిప్పులు చెరిగారు. ఇక మ‌చిలీప‌ట్నం వైసీపీ ఎంపి అభ్య‌ర్ది బాల‌శౌరి గురించి కూడా ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు...ఆయ‌నను వ‌ల‌స ప‌క్షిగా అభివ‌ర్ణించారు. ఇక అవినాశ్ ను లోక‌ల్ గా చూపించే య‌త్నం చేసిన చంద్ర‌బాబు... గుడివాడ‌ అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించ‌గానే.. అవినాశ్ ఇక్క‌డే ఇల్లు కొనుక్కొని ఇక్క‌డే స్థిర ప‌డ్డాడ‌ని..మీ అంద‌రికీ అందుబాటులో ఉంటాడ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. కొంద‌రు నేత‌లు కుల ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌ని ఆరోపించిన చంద్రబాబు...  తాను అన్ని కులాలు - వ‌ర్గాలను క‌లిపే ప‌నిలో ఉన్నాన‌ని పేర్కొన్నారు.

వంగ‌వీటి రాధా - దేవినేని అవినాశ్ ల‌ను క‌లిపాన‌ని - క‌డ‌ప - క‌ర్నూలు లో ఉప్పు నిప్పు గా ఉండే నేత‌లను ఒక్క‌తాటి కింద‌కు తీసుకొచ్చాన‌ని చెప్పుకొచ్చారు. ఇక గుడివాడ‌లో మెజారిటీ ఓటర్లుగా ఉన్న కాపుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే క్ర‌మంలో కాపులు వైసీపీ ఎందుకు ఓటు వేయాల‌ని ప్ర‌శ్నించారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను ఇచ్చింది తానే అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. వైయ‌స్ హ‌యాం లో కాపుల‌ను మోసం చేసారన్నారు. కాపుల‌కు వెయ్యి కోట్లు ఇస్తాన‌ని చెప్పి ఇచ్చి మాట నిల‌బెట్టుకున్నాన‌ని వివ‌రించారు. కాపు రిజ‌ర్వేష‌న్ త‌న ప‌రిధిలో లేద‌ని చెప్పిన జ‌గ‌న్ కు కాపుల ఓటు అడిగే హ‌క్కు లేద‌న్నారు. కాపుల‌కు అయిదు వేల కోట్లు ఇచ్చిన త‌న‌కే వారి ఓట్లు వేయాల‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మొత్తంగా గుడివాడ ప్ర‌చారంలో కొడాలి నానిపై ఉన్న త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కిన చంద్ర‌బాబు... లోక‌ల్ ను నాన్ లోక‌ల్ గా, నాన్ లోక‌ల్ ను లోకల్ గా చూపే య‌త్నం చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News