బాబు మాట‌!... ఈసీది ప‌క్ష‌పాత‌మే!

Update: 2017-08-29 11:39 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక ముగిసింది. అక్క‌డి ప్ర‌జ‌లు కొత్త‌గా ఏమీ తీర్పు చెప్ప‌లేక‌... అధికారంలో ఉన్న పార్టీ వైపే మొగ్గుచూపార‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందుగా నంద్యాల‌లో తెర లేచిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ధికి ఎక్క‌డ బ్రేక్ ప‌డుతుందోన‌న్న భ‌యంతోనే నంద్యాల ఓట‌ర్లు అధికార టీడీపీకి ఓటేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాకుండా... 2019 ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌ గా భావించిన ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా టీడీపీ... 12 మంది మంత్రుల‌ను - 50 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను అక్క‌డ మోహ‌రించి ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి - ఓట్ల‌ను రాబ‌ట్టుకున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఎతావ‌తా... ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి కాకుండా విప‌క్ష పార్టీకి ఓటేస్తే... ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న కోణంలో ఆలోచించిన నంద్యాల ఓట‌రు... టీడీపీకే ఓటేశార‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలో నంద్యాల‌లో టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించిన వైనంపై నిన్న ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మీడియా స‌మావేశం పెట్టీ మ‌రీ త‌మ గెలుపున‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. అయితే ఈ సంద‌ర్భంగా అస‌లు విష‌యాన్ని దాచేసిన చంద్ర‌బాబు... విప‌క్షంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో పాటుగా తాము నంద్యాల‌లో అనుస‌రించిన వ్యూహాల‌ను దాచేసి మ‌సి పూసి మారేడు కాయ చేశార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ప‌నిలో ప‌నిగా... ఎన్నిక‌ల సంఘంపై త‌న‌కున్న అక్క‌సును కూడా చంద్రబాబు వెల్ల‌గ‌క్కార‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు.  నంద్యాల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్‌ కూడా పక్షపాతంగా వ్యవహరించిందని, ఇరుపక్షాలను సమానంగా చూడలేదని చెప్పారు. అయినా ఎన్నిక‌ల సంఘం ఎన్న‌డైనా ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలున్నాయా? అంటే... దాదాపుగా లేవ‌నే చెప్పాలి. మ‌రి చంద్ర‌బాబు అదే ఎన్నిక‌ల సంఘానికి ఎలా ప‌క్ష‌పాతాన్ని ఆపాదించార‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌నే చెప్పాలి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా స్వ‌యంగా చంద్ర‌బాబే ఎన్నిక‌ల కోడ్‌ను అతిక్ర‌మించార‌న్న వాద‌న వినిపించింది. కోడ్ ఉన్న ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను గానీ, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా వ్యాఖ్య‌లు గానీ చేయ‌డానికి వీల్లేదు. అయితే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రాక ముందే నంద్యాల‌లో రెండు ప‌ర్యాయాలు ప‌ర్య‌టించిన చంద్రబాబు... అక్క‌డ వేలాది కోట్ల రూపాయ‌ల ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తాను అధికారం చేప‌ట్టిన త‌ర్వాత మూడేళ్ల దాకా నంద్యాల అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించ‌ని చంద్ర‌బాబు... కేవ‌లం ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డుతున్న త‌రుణంలో అక్క‌డికి వెళ్లి ప‌నుల‌కు అక్క‌డిక‌క్క‌డే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీనిపై జ‌నం ఏమ‌నుకున్నా త‌న‌కేం ఫ‌రవా లేద‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు... త‌మ‌కు ఓటేయ‌కుంటే తాము వేసిన రోడ్ల‌పై న‌డ‌వొద్ద‌ని, తానిచ్చే పింఛ‌న్లు తీసుకోవ‌ద్ద‌ని కూడా ఆయ‌న నంద్యాల ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టారు. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా స‌ర్వే సంస్థ‌ల పేరిట ఎంట్రీ ఇచ్చిన బాబు యంత్రాంగం... ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేయ‌కుంటే... పింఛ‌న్లు క‌ట్ చేస్తామ‌ని బెదిరించార‌ట‌. దీనిపై వివిధ మీడియా సంస్థ‌ల్లో పెద్ద ఎత్తున క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.

ఈ వ్య‌వ‌హారాల‌పై విప‌క్షం ఫిర్యాదు చేసినా... స‌రైన ఆధారాలు లేని కార‌ణంగా ఎన్నిక‌ల సంఘం పెద్ద‌గా స్పందించిన దాఖ‌లా లేదు. ఇక‌పోతే... ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ చేసిన ఘాటు వ్యాఖ్య‌ల‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగానే తాత్సారం చేసిన చంద్ర‌బాబు... స‌రిగ్గా పోలింగ్‌ కు ఓ రోజు ముందుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌లుపు త‌ట్టారు. త‌న ఎంపీలతో జ‌గ‌న్‌ పై ఫిర్యాదు చేయించారు. దీంతో ఓ వైపు పోలింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే జ‌గ‌న్‌ కు నోటీసులు జారీ అనే అంశాన్ని ఎన్నిక‌ల సంఘం పేరిట తెర మీద‌కు తెచ్చిన చంద్ర‌బాబు అండ్ కో... ఓట‌ర్ల‌ను తీవ్రంగానే ప్ర‌భావం చేశార‌న్న వాద‌న ఉంది. పోలింగ్ ప్రారంభ‌మైన కాసేప‌టికే జ‌గ‌న్‌ కు నోటీసులు అంటూ ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తే... దానికి మ‌రింత ఆజ్యం పోసి జ‌గ‌న్ అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న కోణంలో త‌న అనుకూల మీడియాలో వ‌రుస క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేయించిన టీడీపీ... ఓట‌ర్ల‌ను బాగానే త‌న వైపు తిప్పేసుకుంద‌ట‌. దీనినంత‌టినీ ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు... ఎన్నిక‌ల సంఘం త‌మ ప‌ట్ల ప‌క్ష‌పాత వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్ప‌డంపై ఇప్పుడు జ‌నం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News