హోదా అంటే ఎంత తేలికైపోయింది బాబు!

Update: 2016-10-05 05:06 GMT
ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా... కేంద్ర ప్ర‌భుత్వం  ఇటీవ‌ల స‌సేమిరా ఇచ్చేది లేద‌ని తేల్చిచెప్పి మాన‌ని గాయం చేసిన అంశం. ఈ విష‌యంలో ఒక‌వైపు ఏపీలో ఆందోళ‌నలు కొన‌సాగుతుంటే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం హోదాను పూచిక‌పుల్లతో సమానంగా తీసిపారేశారు. నాయకత్వ సాధికారితపై గుంటూరు జిల్లా కేఎల్ వర్సిటీలో మూడురోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాలను చంద్రబాబు జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రారంభించి మాట్లాడారు. పార్టీకి చెందిన కేంద్ర - రాష్ట్ర మంత్రులు - ఎంపి - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - జెడ్‌ పీ - మున్సిపల్ చైర్మన్లు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి తరగతులు ముగిసేవరకు ఏ ఒక్కరూ వెలుపలకు వెళ్లకుండా, కనీసం ఫోన్‌ లో కూడా మాట్లాడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తొలిరోజు తొలి సెషన్‌ లో చంద్రబాబు రాష్ట్ర విభజన ప్రక్రియ-సవాళ్లు-పటిష్ఠ నాయకత్వంతో పరిష్కారాలపై కీలకోపన్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదాను లైట్ తీసుకోవడం ఆస‌క్తిక‌రం.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్ర‌సంగిస్తూ.... "ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదాపైనే చర్చ జరుగుతోంది. అయితే మనం ఇచ్చింది తీసుకుందాం.. ఆపై హక్కుగా రావాల్సిన దానికోసం పోరాడదాం.. విపక్షాలు మాత్రం ప్యాకేజీ వద్దు.. హోదానే కావాలంటూ సొంత పైత్యాలతో ఆందోళన చేస్తున్నాయి. అసలు వారికి హోదాపై అవగాహన లేదు’ అని ధ్వజమెత్తారు. పరిశ్రమలు రావటానికి రాయితీలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. హోదా లేకపోయినా రాష్ట్రంలో మూడులక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ముందుకు రాగా ఇప్పటికే దాదాపు లక్షా 50వేల కోట్ల పెట్టుబడులు రావటం.. పనులు ప్రారంభం కావటం కూడా జరిగిందని చంద్ర‌బాబు అన్నారు. అసలు ప్రత్యేక హోదాలో పన్ను రాయితీ అనే పదం లేనేలేదని బాబు తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల మనం ప్రతి ఏటా నష్టపోయేది కేవలం మూడువేల కోట్లు మాత్రమేనని - దీన్ని కూడా కేంద్రం ‘ఇఎపి’ రూపంలో రుణంగా తీసుకున్నట్లుగా చూపి ఆ రుణాన్ని కేంద్రమే తీసుకుని రాష్ట్రానికి తిరిగి చెల్లిస్తుందన్నారు. ఈ విధానం వల్ల రాష్ట్రానికి రానున్న ఐదేళ్లలో రూ.22,500 కోట్లు అందుబాటులో ఉండటమేగాక మరో ఐదు - పదేళ్లలో మరో 22,500 కోట్లు లభ్యం కాగలవని చంద్ర‌బాబు తెలిపారు.  ‘గతంలో తొమ్మిదేళ్లపాటు నేను రాష్ట్రాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టాను. సత్ఫలితాలు కూడా వచ్చాయి కదా తిరిగి అధికారంలోకి రాలేకపోతామా అనే మితిమీరిన విశ్వాసంతో ఉంటే వరుసగా 2004 - 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం. ప్ర‌స్తుతం సంక్షేమం - అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం 175 నియోజకవర్గాల్లో సమానంగా నిర్వహిస్తుంటే కొన్నింట పూర్తిగా ప్రజామోదాన్ని ఎందుకు పొందలేకపోతున్నామో ఆలోచించాలి. కొందరు నేతలు ఐదేళ్లు ఎంత కష్టపడ్డా గెలవలేకపోవడానికి వారిలో నాయకత్వ లక్షణాలు కొరవడటమే కారణం" అంటూ చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రతి దానికి ప్రజల ఆమోదం పొందడం, సమర్ధవంతమైన నాయకత్వం కల్గి విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం - నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తల్లో కూడా తమపై విశ్వాసం - నమ్మకం పెంచుకునే లక్షణాలు నాయకులకు ఉండాలని చంద్రబాబు సూచించారు.

రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం లభిస్తున్నదని అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు పలు రకాల రాయితీలు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకయ్యే నిర్మాణాన్ని కేంద్రం పూర్తిగా భరించనున్నదంటూ ఇప్పటివరకు ఖర్చుపెట్టిన రూ.8వేల కోట్లు కూడా తిరిగి చెల్లించడానికి కేంద్రం సంసిద్ధత తెలిపిందన్నారు. జిఎస్‌ టి వస్తున్న నేపథ్యంలో ఇక దేశం మొత్తంమీద ఎక్కడా పన్ను రాయితీలు ఉండబోవన్నారు. గ్రామాల్లోని పేదలు పశు సంపదపై ఆధారపడి ఉన్నందున ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా పెంపకందారుల ఇళ్ల పరిసరాలనుంచి పశువుల పేడ సేకరించి దాన్ని ఎరువుగా మార్చి తిరిగి అదే నిష్పత్తిలో నేరుగా ఆ రైతు భూమికే ఆ ఎరువును పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని దీనివల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం - పరిశుభ్రత విరాజిల్లగలదని బాబు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News