బాబుగారు.. మీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా?

Update: 2019-04-11 05:46 GMT
దేశంలో చాలామంది రాజకీయ అధినేతలు ఉన్నా.. వారికి భిన్నంగా కనిపిస్తారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన్ను ఎంతగా తిడతారో.. అంతగా పొగిడేవారున్నారు. పెద్దగా ప్రచారంలోకి రాని కార్పొరేట్ స్టైల్ ను అందరికి సుపరిచితం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. పని రాక్షసుడిగా ఆయన్ను ముద్దుగా పిలుచుకునే వారెందరో.. అంతే కసిగా తిట్టే వారు కనిపిస్తారు.

దివంగత మహానేత వైఎస్.. బాబును ఉద్దేశించి భలేగా చురకలు వేసేవారు. ఆ మాటకు వస్తే.. ఆయన పుణ్యమా అని బాబు నవ్వటం షురూ చేశారని చెప్పాలి. ఎప్పుడూ సీరియస్ గా ఉండే బాబును మార్చటంలో వైఎస్ పాత్ర కొంత ఉందని చెప్పాలి. పని తప్పించి మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించే బాబును.. అందుకు భిన్నంగా తనను తాను ప్రజంట్ చేసుకునేలా వైఎస్ చేశారని చెప్పాలి.

ఏపీలో హాట్ హాట్ గా జరుగుతున్న ఎన్నికల వేళ.. బాబు అవిశ్రాంతంగా ప్రచారాన్నినిర్వహించారు. బాబుతో పోటీ పడిన జగన్.. పవన్ లు వయసులో చిన్నవారే అయినా.. బాబు మాదిరి భారీ ఎత్తున ప్రచార సభల్లో పాల్గొన్నది లేదు. ప్రచారానికి ఆటవిడుపు ఇచ్చేసిన వేళ.. ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.. వార్తల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. బాబులోని మరో కోణాన్ని పరిచయం చేస్తూ ఆయన కుమారుడు లోకేశ్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బాబును ఏ మాత్రం ఊహించలేని రీతిలో ఉన్న ఫోటోలో ఏముందంటే.. మనమడు దేవాన్ష్ తో కలిసి సేద తీరారు. తాతా.. మనమళ్లు ఇద్దరూ నవ్వులు చిందితస్తూ.. ఇంటి ఆవరణలో సరదాగా పరుగులు తీస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు.

ఫోటోను పోస్ట్ చేసిన లోకేశ్.. . ‘‘ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచారసభల్లో పాల్గొన్న చంద్రబాబు గారికి కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతా మనవళ్లు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు’’  అంటూ పెట్టిన పోస్ట్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News