సోము నోటికి తాళం, సీటుకు చెక్‌ పెట్టేసినబాబు!

Update: 2015-11-03 04:30 GMT
కొన్ని రోజులుగా.. భాజపా నాయకుడు సోము వీర్రాజు చంద్రబాబు నాయుడు మీద చెలరేగిపోవడం లేదు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సొమ్ములను రాష్ట్రం దుర్వినియోగం చేసేస్తున్నదని.. తమకు రావాల్సిన కీర్తిని ఇవ్వడం లేదని మాట్లాడడం లేదు. కొన్నిరోజులకు ముందు వరకు ప్రతిరోజూ చంద్రబాబునాయుడు సర్కారును దుమ్మెత్తిపోయడం అనేది తనకు ఒక ఉద్యోగం అన్న రీతిలో చెలరేగిపోయిన సోము వీర్రాజు హఠాత్తుగా ఇంత సైలెంట్‌ అయ్యారేమిటి? అంటే, దీని వెనుక చంద్రబాబునాయుడు ప్రమేయం ఉన్నదని రాజకీయ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సోము వీర్రాజు చంద్రబాబు సర్కారుమీద ఏ రేంజిలో ఫైరవుతూ వచ్చారో అందరూ గమనించారు. అదే సమయంలో ఆయన భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి మీద కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఆ సీటు ఆయనకు దక్కకుండా చక్రం అడ్డేశారని ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజు లాంటి నోటిదూకుడు నాయకుడు రాష్ట్ర భాజపా సారధి అయితే ఇరు పార్టీల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దాని పర్యవసానంగానే సోము ఒక్కసారిగా సైలెంట్‌ అయినట్లు చెప్పుకుంటున్నారు.

అదే సమయంలో సోము వీర్రాజు ఏ కాపు కార్డునైతే బలంగా ఉపయోగించి భాజపాలో తను చక్రం తిప్పాలని అనుకున్నారో.. ఆ కాపు కార్డు కూడా భాజపాకు గరిష్టంగా ఉపయోగపడకుండా ఉండేలా చంద్రబాబునాయుడు చేసేస్తున్నారు. కాపులకు ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ సోము వీర్రాజు గతంలో విమర్శించారు. ప్రస్తుతం సోమవారం నాటి కేబినెట్‌ భేటీలో కాపులను బీసీల్లోచేర్చడానికి ఒక కమిషన్‌ ఏర్పాటు చేయడం గురించి , కాపు కార్పొరేషన్‌ కు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించడం గురించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సోము వీర్రాజు నోటికి కూడా చంద్రబాబు తాళం వేశారని అనుకోవాలి.

సో, ఇన్నాళ్లూ చంద్రబాబును ఆడిపోసుకున్నందుకు ఇప్పుడు సోము అటు పదవి సంగతి డైలమాలో పడిపోగా, తిట్టడానికి అనుమతులు లేక, అంశాలు కూడా లేక సతమతం అవుతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News