బాబు నోట‌.. ఈ దేశంలో మేం భాగం కాదా?

Update: 2018-03-13 04:46 GMT
డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. భార‌త ప్ర‌భుత్వం చ‌టుక్కున స్పందించాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. నిర్ల‌క్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌స్తోంద‌న్న విష‌యం చ‌రిత్ర‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఏపీ విభ‌జ‌న అక్క‌డితో ఆగ‌ద‌ని.. దాని కాష్ఠం ర‌గులుతూనే ఉంటుంద‌ని.. పెద్ద మ‌న‌సు చేసుకొని దాన్ని ఆర్ప‌క‌పోతే.. అది దేశానికే న‌ష్ట‌మ‌న్న వాద‌న‌లు వినిపించినా.. మ‌రీ ఓవ‌ర్ గా ఆలోచిస్తున్నారంటూ కొట్టిపారేసినోళ్లు ఎంతోమంది. వారి ఆలోచ‌న త‌ప్ప‌ని తాజాగా వ‌స్తున్న మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయని చెప్పాలి.

ఏపీ విభ‌జ‌న జ‌రిగిన కొత్త‌ల్లో లోక్ స‌త్తా జేపీ నోటి నుంచి కీల‌క వ్యాఖ్య ఒక‌టి వెలువ‌డింది.విభ‌జ‌న గాయాన్ని మాన్పేందుకు నేత‌లు జాగ్ర‌త్త‌గా ప్ర‌య‌త్నించాలి. ఎక్కడా నిర్ల‌క్ష్యం పోకూడ‌దు. లేనిప‌క్షంలో కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత ఈ దేశంలో మేం భాగం కాదా? అన్న భావ‌న ఏపీ ప్ర‌జ‌ల‌కు క‌లిగితే.. అది ఈ దేశ స‌మ‌గ్ర‌త‌కే ముప్పు. అలాంటి ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే చాలా న‌ష్టం జ‌రుగుతుంద‌న్న మాట చెప్పారు.

జేపీ నోటి వెంట ఈ త‌ర‌హా మాట వ‌చ్చినంత‌నే చాలామంది లైట్ గా తీసుకున్నారు. పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. కానీ.. ఆ త‌ర్వాతి కాలంలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇదే మాట‌ను చెప్పారు. ఈ దేశంలో ఏపీ భాగం కాదా?  ఏపీ స‌మ‌స్య‌ల మీద కేంద్రం ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేదు?  త‌మ‌కు జ‌రిగిన అన్యాయం మీద ఏపీ ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు.. వారి ఆలోచ‌న‌లు దేశ స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ తీసేలా మార‌కుండా కేంద్రం జాగ్ర‌త్త‌ప‌డాల‌న్న సూచ‌న చేశారు.

జేపీ మాట‌ల మాదిరే ప‌వ‌న్ మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కొంద‌రు ప‌ట్టించుకున్నా.. అలాంటి పిచ్చి భావ‌న ఎందుకు చేస్తారంటూ ద‌బాయించిన వారు లేక‌పోలేదు. కానీ.. ఈ రోజు అదే మాట‌ను ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోటి నుంచి కూడా వ‌చ్చేసింది. దేశంలో సుదీర్ఘ‌రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌ల్లో బాబు ఒక‌రిగా నిలుస్తారు. ఆచితూచి మాట్లాడ‌టం.. సంచ‌ల‌నాల కోసం తొంద‌ర‌ప‌డి నోరుజార‌టం లాంటివి చంద్ర‌బాబు చేయ‌ర‌న్న పేరుంది.

అలాంటి బాబు సైతం తాజాగా  గ‌వ‌ర్న‌ర్క కు ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం మీద ఏపీ మండ‌లిలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. మేం ఈ దేశంలో భాగం కాదా? అన్న ప్ర‌శ్న‌ను సంధించారు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి నోటి నుంచి.. అది కూడా చ‌ట్ట‌స‌భ‌ల చేసిన ఈ తీవ్ర వ్యాఖ్య‌పై ఇప్ప‌టికైనా కేంద్రంలో క‌ద‌లిక రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రిగా నేత‌ల్లో ఈ త‌ర‌హా భావ‌న వ‌స్తే.. అది ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. వారు ఆ దిశ‌గా ఆలోచించ‌టం మొద‌లు పెడితే.. కొత్త ఇబ్బందులు తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. ఉత్త‌రాదికి.. ద‌క్షిణాదికి మ‌ధ్య దూరం మ‌రింత పెర‌గ‌టం ఖాయం. ఈ దేశంలో ఏపీ భాగం కాదా? అన్న మాట మేధావిగా అభివ‌ర్ణించే జేపీ నోట తొలుత వ‌స్తే.. నాలుగైదేళ్ల వ్య‌వ‌ధిలో అదే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నోటి నుంచి రావ‌టం దేనికి నిద‌ర్శ‌నం?
Tags:    

Similar News