ఎన్నాళ్లకెన్నాళ్లకు?; బాబు ఉగ్రరూపం

Update: 2016-07-21 13:42 GMT
పదేళ్ల ప్రతిపక్ష నేతగా ఎదురైన అనుభవాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్ సెట్ ను ఎంతగా మార్చిందన్నది గడిచిన పాతిక నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అధికారుల్ని.. కాంట్రాక్టర్లను.. ఇలా ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకు నానా పాట్లు పడుతూ ఎవరినీ తనకు దూరం చేసుకోకుండా ఉండాలన్న ఆరాటం స్పష్టంగా కనిపించింది. బాబు ఫీలైంది ఒకటైతే.. అధికారులకు.. కాంట్రాక్టర్లు మరొకటి అర్థమైన పరిస్థితి. అందుకే.. పాలనలో వేగం లేకపోవటమే కాదు.. పనుల పురోగతి మీద తాను చెప్పిన మాటల్ని లైట్ తీసుకుంటున్న తీరు బాబుకుటం మంట పుట్టేలా చేసింది. దాదాపు వారం కిందట కృష్ణా పుష్కర పనుల పెండింగ్ విషయంలో వేగం పెరగాలని.. చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయని వారి సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవటం చిర్రెత్తెలా చేసింది.

తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగంలోని సీతానగరం పుష్కర ఘాట్లను గురువారం మధ్యాహ్నం పరిశీలించిన ఆయన..ఇంకా పనులు ఒక కొలిక్కి రాకపోవటంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సంబంధిత శాఖాధికారులపై అగ్గి ఫైర్ అయిన ఆయన చీవాట్లు పెట్టటమే కాదు.. పని చేస్తున్న కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు. బాబు కోపాన్ని చూసినోళ్లు షాక్ తింటే.. మరికొందరు మాత్రం.. ఇన్నాళ్లకైనా బాబు మునుపటి సీరియస్ నెస్ కనిపించిందని.. ఇలా కొరడా ఝుళిపించకపోతే పనులు అయ్యే అవకాశం లేదన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం. మంచిగా ఉండాలనుకోవటం తనను అసమర్థుడిగా మారుస్తుందన్న నిజాన్ని ఇప్పటికైనా బాబు గుర్తించటం మంచిపని అని చెప్పక తప్పదు.
Tags:    

Similar News