అరె.. చంద్రబాబుకు కోపం వచ్చింది

Update: 2015-09-07 04:04 GMT
చంద్రన్నకు కోపం వచ్చేసింది. తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో వెలిగిపోయిన చంద్రబాబు.. అప్పట్లో ఆకస్మిక తనిఖీలు.. అధికారుల మీద మండిపాటు ఇలా చెలరేగిపోయే వారు. తర్వాత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. అధికారుల మీద మండిపాటు తననెంత బ్యాడ్ చేసిందీ ఆయనకు తెలిసొచ్చేలా చేసింది.

ఉద్యోగుల వ్యతిరేకిగా తనపై పడిన వ్యతిరేకతను తగ్గించుకోవటానికి ఆయన చాలానే తిప్పలు పడాల్సి వచ్చింది. అంతేకాదు.. తనపై ఉన్న ఉద్యోగ వ్యతిరేకి అన్న ట్యాగ్ లైన్ ను తుడిపేసుకోవటానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఆయనే ఈ విషయాన్ని ప్రస్తావించి వివరణ ఇచ్చుకునే వారు. అందుకు తగ్గట్లు విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బాబు.. ఉద్యోగుల విషయంలో తొందరపడేవారు కాదు.

ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటున్నారు. వారి కారణంగా తప్పులు జరుగుతున్న విషయాన్ని గుర్తించినా ఆయన చూసీచూడనట్లు ఉంటున్నారే తప్పించి ఆగ్రహం వ్యక్తం చేయని పరిస్థితి. దీనికి భిన్నంగా సోమవారం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గురుపూజోత్సవం సందర్భంగా విశాఖకు వచ్చిన చంద్రబాబు.. ఆదివారం ఉదయం నుంచే ఆయన నగర పర్యటనను మొదలు పెట్టారు. నగరంలో సుడిగాలి పర్యటన జరిపిన బాబు.. మొత్తంగా ఆరు గంటలు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. పారిశుద్ధ్యం.. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోర్టు పరిసరాల్లో కాలుష్యం విపరీతంగా ఉండటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మనోరమ థియేటర్ వద్దనున్న కల్వర్ట్ నిర్మాణం అసంతృప్తిగా ఉండటంపై సీరియస్ అయిన ఆయన.. అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించటం.. దీనికి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు.. ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏం ఆడుకుంటున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? ఈ పనులేంది? అంటూ తీవ్రంగా ప్రశ్నిస్తూ అగ్రహం చేయటంతో సదరు ఉద్యోగి నోట మాట రాని పరిస్థితి.

ఇంతకాలం సంయమనంతో వ్యవహరించిన చంద్రబాబు.. ఉన్నట్లుండి ఉద్యోగుల మీద మండిపడాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నలు ఒకపక్క.. బాబు కాస్తా పాత బాబు అయిపోయాడేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే.. బాబు వైఖరిని అర్థం చేసుకోవాలని.. సమస్యలు తీవ్రంగా ఉండి.. ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండటంపై పనులు జరుగుతున్న తీరుతోనే బాబు సీరియస్ అయ్యారంటూ తమ్ముళ్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా బాబు మాత్రం సీరియస్ కావటం నిజం. రానున్న రోజుల్లో మరిన్ని వార్నింగ్ లు ఇచ్చే బాబు దర్శనమివ్వటం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News