కేంద్రాన్ని ఇరుకునపెట్టమంటే..నన్నే ఇరికిస్తారా!

Update: 2018-06-29 11:22 GMT
కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ నిరాహార దీక్ష చేస్తుండడం... మిగతా ఎంపీలంతా దిల్లీ చేరుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో రమేశ్ దీక్ష విషయంలో నిన్న దిల్లీలో టీడీపీ ఎంపీలు చిట్ చాట్ చేసుకుంటూ నిరాహార దీక్ష గురించి లూజ్ టాక్ చేసిన విషయం వీడియో రూపంలో బయటకు రావడంతో టీడీపీ ఇరుకునపడింది. చంద్రబాబుకైతే ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదట. తనకు ఎంతో ఇష్టుడైన మురళీ మోహనే ఇలా నాన్ సీరియస్ వ్యాఖ్యలతో పార్టీ పరువు బజారున పడేయడంతో ఆయనకు గట్టిగా క్లాస్ పీకారట.
    
శుక్రవారం ఆయన ఎంపీలో టెలికాన్ఫరెన్సు నిర్వహించి ఈ విషయంపైనే మాట్లాడారు. కేంద్రాన్ని ఇరుకునపెట్టమని పంపిస్తే నన్నే ఇరుకునపెడతారా అని ఆయన ఎంపీలనుద్దేశించి నిష్టూరమాడారు. అంతేకాదు.. మురళీ మోహన్‌ ను ఈ విషయంలో కాస్త గట్టిగానే నిలదీశారు. సాటి ఎంపీ పది రోజులుగా దీక్ష చేస్తుంటే ఇలా బరువు తగ్గడానికంటూ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. కడప ఉక్కు కోసం ఇంత కష్టపడుతుంటే దీనిమీద జోకులెలా వేస్తారని ఆయన మురళీమోహన్‌ ను తలంటినట్లు చెబుతున్నారు.
    
అయితే... ఏదో సరదాగా మాట్లాడిన మాటలే తప్ప బాధ్యతారహితం కాదంటూ మురళీమోహన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా చంద్రబాబు మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సాటి ఎంపీ పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఇలా సరదాగా మాట్లాడడం సరికాదని ఆయన మందలించారు. దీంతో మురళీ మోహన్.. ఆ వీడియోను ఎడిట్ చేసి అలా మార్చేశారంటూ కప్పిపుచ్చుకునేందుకు మరో ప్రయత్నం చేయగా ఇంకేమీ చెప్పొద్దంటూ చంద్రబాబు సీరియస్ గా అన్నారని సమాచారం.


Tags:    

Similar News