కొత్త మంత్రుల‌ను వెతుక్కుంటానంటున్న బాబు

Update: 2017-01-26 04:53 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ‌రోమారు త‌న మంత్రివ‌ర్గం ప‌నితీరుపై రుసరుస‌లాడారు. మంత్రుల పనితీరుపై మండిపడిన బాబు పనితీరు మార్చుకోకపోతే ఇకపై కఠినంగా వ్యవహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమర్థవంతంగా పనిచేయకపోతే వచ్చిన సమస్యలకు తాను ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తవారిని వెతుక్కుంటానని స్పష్టం చేశారు. తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు, పార్టీ-ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం. పలు జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలను ఎదుర్కోవడంలో మంత్రులు, జిల్లా పార్టీ నాయకత్వాలు ఘోర వైఫల్యం చెందాయని బాబు నిప్పులు చెరిగారు. మంత్రులు-జిల్లా నేతల నిర్లిప్త వైఖరి వల్ల పార్టీ నష్టపోయి, ప్రతిపక్షాలు బలపడుతుంటే తాను చూస్తే ఊరుకోనని హెచ్చరించారు. మీ అసమర్థత, నిర్లిప్త, నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రతిపక్షాలు బలపడుతున్నాయే తప్ప వాటికి ఆ సమర్థత లేదని వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు, రోడ్డెక్కి విధ్వంసానికి పాల్పడిన వైనాన్ని బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేను ప్యాకేజీ నిధుల జీవో ఇచ్చి ఎన్నాళ్లయింది? దానిపై మీరెందుకు ఫాలోఅప్ చేయలేదు? వాళ్లకు ఆ పరిహారం ఇచ్చి ఉంటే రోడ్డెక్కేవాళ్లు కాదుకదా? మీ అందరికీ అవకాశాలిచ్చా. అయినా మీ అసమర్థత, సమన్వయలోపం వల్ల నేను ప్రజలకు సారీ చెప్పాల్సి వచ్చింద’ని మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుపై చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని స‌మాచారం. ఫ్యాక్షన్ జిల్లా కడపలోనే ఇరిగేషన్, ఇతర పనులు బ్రహ్మాండంగా జరుగుతుంటే, సున్నితమైన మీ జిల్లాల్లో ఎందుకు ఆగిపోతున్నాయి’ అని ఘాటుగా అక్షింతలు వేశారని తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి రావెల కిశోర్‌ బాబుపైనా బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్రమశిక్షణా రాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి కొత్త అయినా మంత్రి పదవి ఇస్తే ముఠా తగాదాలతూ పార్టీని రోడ్డున పడేస్తారా? మీ జడ్పీ చైర్మన్, మీరూ పార్టీకి కొత్త అయినా పదవులిచ్చినందుకు మీరు చేసే నిర్వాకం ఇదా? మీకు క్రమశిక్షణ తెలియదా? ఇకపై చిన్నా పెద్ద అనేది చూడను. తేడా వస్తే వేటు వేస్తానని హెచ్చరించారు. అదే సమయంలో జడ్పీ చైర్మన్ జానీమూన్ కూడా కొత్తగా వచ్చినా పదవి ఇచ్చా. ఆమెను నువ్వే కదా తీసుకువచ్చింది? అని మంత్రి పుల్లారావుపైనా రుసరుసలాడారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక‌ హోదా సాకుతో విపక్షాలు బలపడాలని చూస్తున్నాయని, జిల్లాల వారీగా సమస్యల పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను జాగ్రత్తగా గమనించి, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఎదురుదాడి చేయాలని చంద్ర‌బాబు ఆదేశించారు. ‘మీపై నమ్మకంతో పదవులిస్తే దానికి న్యాయం చేయకపోతే ఎలా? మీరు సమర్థవంతంగా పనిచేయకపోతే వేరేవాళ్లను చూసుకుంటా? ప్రతిదీ నేనే చెప్పాలా? మీకు బాధ్యత లేదా’ అని ప్రశ్నించారు. జల్లికట్టు-హోదాకు ముడిపెడుతున్న వైనాన్ని తిప్పికొట్టాలన్నారు. ఇకపై తాను పార్టీపై పూర్తి స్ధాయిలో దృష్టి సారిస్తానన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News