త‌మ్ముళ్లకు బాబు మాటంటే లైట్!

Update: 2017-05-23 05:50 GMT
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు, పార్టీ అధినేత మాట‌ను జ‌వ‌దాట‌ని నాయ‌కుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన‌ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయవ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారంలో ఉన్నందున ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సింది పోయి సొంత పార్టీ నేత‌ల‌నే హ‌త్య‌చేయించ‌డం, ప్ర‌త్య‌ర్థుల‌కు ప్రాణాలు తీయ‌డం, వాటాలకోసం కొట్లాడుకోవ‌డం వంటి విప‌రీత పోక‌డ‌ల‌కు తెలుగుదేశం వేదిక‌గా మారింద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా జ‌రుగుతున్న ఇలాంటి సంఘట‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే రీతిలో ఉన్నాయ‌ని, ఇందుకు తెలుగు తమ్ముళ్ల తీరు కార‌ణ‌మ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌లి కాలంలో తెలుగుదేశం పార్టీ నేత‌లు ముఖ్యంగా కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల తీవ్ర వివాదాస్ప‌ద వైఖ‌రి పార్టీ ప్రతిష్టకు ముప్పు తీసుకువ‌చ్చే స్థాయికి చేరింద‌ని అంటున్నారు. అధినేత చంద్ర‌బాబు ఆదేశాల‌కు అనుగుణంగా ముందుకు సాగిన తెలుగుత‌మ్ముళ్లు ఇప్పుడు బాబు మాట అంటే డోంట్ కేర్ స్థాయికి చేరిపోయార‌ని చెప్తున్నారు. ఇది ఏ ఒక్క జిల్లాకో ప‌రిమితం కాకుండా అన్ని జిల్లాల్లోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచి మొదలుకొని బ‌ల‌మైన ప‌ట్టున్న గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు ఇదే బ్యాడ్‌ ట్రెండ్ ఉందంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి వర్సెస్ కరణం వర్గీయుల మధ్య నెలకొన్న గొడవలు చివరకు హత్యలకు దారితీయటం పార్టీ ప‌రువును గంగ‌పాలు చేసింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని చెప్తున్నారు. ఇక‌ సొంత జిల్లా చిత్తూరులో ఎంపీ శివప్రసాద్, సీనియ‌ర్ నేత బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి చేసిన రచ్చ చంద్రబాబుకు తలబొప్పికట్టేలా చేసింది. అంతేకాకుండా పార్టీ సీనియర్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి నేతల మధ్య సఖ్యత లేకపోవటం మంత్రిపదవి ఆశించి భంగపడ్డ గాలి సైలెంటవ్వటం, మంత్రిపదవి తీసేసిన తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాస్తంత వయొలెంటుగా స్పందించటం స్థానిక పార్టీ యంత్రాంగాన్ని అభద్రతా భావానికి గురయ్యేట్లు చేసింది.

కీల‌క‌మైన రాజ‌ధాని ప‌రిధిలోకి వ‌చ్చే గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ దాదాపు అదే పరిస్థితి ఉండ‌టం తెలుగుదేశం వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. కృష్ణాజిల్లాలో సైతం మంత్రి దేవినేని, ఎంపి కేశినేని నానిల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ జిల్లాలో వర్గపోరుకు దారితీయగా, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ ఆర్టీఏ కార్యాలయం వద్ద గొడవ వ్యవహారం, ఇటీవల చనిపోయిన చిన్నారి సాయిశ్రీ విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమ పై వచ్చిన విమర్శలు రాజధాని నగరంలో పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఇక మంత్రి పదవి పోగొట్టుకున్న రావెల కిషోర్ లాంటి నేతలు చంద్రబాబుకు కంట్లో నలుసులా మారిపోయారని అంటున్నారు గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ ఏకంగా తమ కుటుంబానికి మాజీ మంత్రి రావెల వల్ల ప్రాణహాని ఉందని మీడియా ముందు కంటతడి పెట్టటం రాజధానిలో పార్టీ ఇమేజ్ కు డ్యామేజీ కలిగించింది.

పార్టీకి బ‌ల‌మైన ప‌ట్టున్న గోదావ‌రి జిల్లాల్లోనూ ఇటీవ‌లి కాలంలో తెలుగుదేశం ఇమేజ్ ప‌లుచ‌న ప‌డుతోంద‌ని అంటున్నారు. ప‌శ్చిమగోదావరిలోనూ ఎమ్మెల్యే చింతమనేని ఇటీవ‌ల ఎగ‌ర‌వేసిన తిరుగుబాటు జెండా, గ‌తంలో ఎమ్మార్వోపై దాడి స‌హా ప‌లు వివాదాలు టీడీపీ శ్రేణుల‌నే క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేశాయి. తూర్పుగోదావరిలో సీనియర్ నేత అయిన బుచ్చయ్య చౌదరి చేసిన విమ‌ర్శ‌లు చంద్ర‌బాబును సైతం ఆవేద‌నలో నెట్టివేశాయి. అదేవిధంగా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఓ ఎస్సైని, రైటర్ ను నిర్భందానికి గురిచేయటం, ఏర్పేడు వంటి ఘటనలకు, అక్కడి సమస్యలకు మూలకారణం సొంతపార్టీ నేతలే కావటం, మరికొన్ని జిల్లాల్లో అధికారులపై విపరీతమైన పెత్తనం చెలాయించటం, విజయవాడలో ఆర్టీఏ కమిషనర్ గన్ మ్యాన్ పై ఎమ్మెల్యే బోండా ఉమ చేయిచేసుకోవటం వంటి ఘటలను పార్టీ ప్రతిష్టను ఆకాశం నుండి నేలకు దిగివచ్చేట్లు చేస్తున్నాయి.

సీమ‌లో కీల‌క జిల్లా అయిన అనంతపురంలో మంత్రి పరిటాల తనయుడు శ్రీరామ్ వివాదాల్లోకి తలదూర్చటం, తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పయ్యావుల కేశవ్ వ్యూహాత్మక మౌనం పాటించటం పార్టీకి కొంత ఇబ్బంది కలిగిస్తోందని టాక్‌. త‌ర‌చూ వివాదాలతో సాహ‌వాసం చేసే జేసీ సోదరులకు,  స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీని ఎప్పుడో ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పార్టీ ప‌రంగా ముఖ్య జిల్లా అయిన కర్నూలులో సీనియ‌ర్ నేత‌ రామసుబ్బారెడ్డికి, మంత్రి ఆదినారాయణరెడ్డికి మధ్య నెలకొన్న విభేదాలు అందరికీ తెలిసిందే, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి చివరకు తన ప్రయత్నం విఫలం కావటంతో పార్టీ అధిష్టానం పై కన్నెర్రచేస్తున్నారు.  భూమా వర్గానికి శిల్పా వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా పంచాయితీ చేసినా ఇంకా చాపకింద నీరులా అసంతృప్తి సెగలు నడుస్తూనే ఉన్నాయని అంటున్నారు.

ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వైజాగ్ లో పరిస్థితి చూస్తే మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ పరువును బజారునపడేశాయనే ప్ర‌చారం ఉంది. అంతేకాదు, కోట్లాది రూపాయల విలువైన స్థలాలను సొంతం చేసుకునేందుకు అధికారపార్టీ నేతలు తెరవెనుక ఆడిన డ్రామా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిని తెచ్చిపెట్టాయని అంటున్నారు. నెల్లూరులో ఆనం వర్సెస్ సోమిరెడ్డి వర్గాల మధ్య పోరు, మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు సింహపురి పార్టీ వర్గాల్ని క‌ల‌వ‌రంలో పడేస్తున్నాయని ఆ జిల్లాలోని కొంద‌రు నేత‌ల మాట‌. మొత్తంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ ఎటు చూసినా పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  ఏపీ సీఎం చంద్రబాబుకు తమ్ముళ్ల వ్యవహారం బీపీ తెప్పిస్తోంది. పైగా, వైసీపీ నుండి వచ్చిన వలసల వల్ల పార్టీకి బలం అనుకుంటే, అదికాస్తా పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసింది. దీంతో తానొకటి తలుస్తుంటే తమ్ముళ్లొకటి తలుస్తున్నారన్న ఆవేదన చంద్రబాబును వేధిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండాల‌ని బాబు ఆదేశిస్తే....ప్ర‌జ‌ల్లో తీవ్ర‌ వ్య‌తిరేక‌త పెరిగేలా చేస్తున్న తెలుగు త‌మ్ముళ్ల తీరుతో బాబు అప్ సెట్ అవుతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Tags:    

Similar News