35వేలా అని బాబుకే షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

Update: 2016-10-05 08:11 GMT
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే కావాలంటే కోట్లల్లో ఖర్చు పెట్టాల్సిందే. లక్షల్లో పెట్టే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ప్రజాదరణ ఉన్నా.. ఖర్చు విషయంలో వెనక్కి తగ్గితే విజయవకాశాలు అంతే మేర తగ్గుతాయన్నది చేదు నిజం. మరి.. ఎమ్మెల్యే అయ్యేందుకు కోట్లను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేసే ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్యే అయ్యాక రూ.35వేల ఖర్చును భరించలేరా? అంటే అవుననే చెప్పాలి. రూ.35వేల ఖర్చుకు గుండెలు బాదుకుంటున్న ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు కామెడీగా మారటమే కాదు.. పార్టీ అధినేతతో అక్షింతలు వేయించుకున్న పరిస్థితి.

తాజాగా జరుగుతున్న పార్టీ శిక్షణా సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బాబు మాట్లాడుతూ.. రియల్ టైం పాలన.. డ్యాష్ బోర్డ్.. కైజా యాప్ లాంటి మాటల్ని చెబుతున్న ఆయనకు ఉన్నట్లుండి ఒక సందేహం వచ్చింది. ఇప్పటికిప్పుడు మీలో ఎంతమంది దగ్గర టాబ్లెట్  పీసీలున్నాయ‌ని ప్రశ్నించారు. అధినేత అడిగిన ప్రశ్నకు మౌనమే సమాధానమైంది.

మరోమారు ఆయన నోటి నుంచి  అదే ప్రశ్న రావటంతో.. ట్యాబ్ లు తెచ్చుకున్న అతి కొద్ది ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్న విషయాన్ని చెప్పారు. దీంతో.. సీరియస్ అయిన బాబు.. వెంటనే ఎంత మంది ఎమ్మెల్యేల వద్ద ట్యాబ్ లు లేవో.. వారందరికి ట్యాబ్ లు అరేంజ్ చేయాలని.. వారి నుంచే ట్యాబ్ ఖర్చు వసూలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. బాబు మాటలు తెలుగు తమ్ముళ్లకు షాక్ తగిలినంత పనైంది. ఒక ఎమ్మెల్యే కల్పించుకొని ఒక్కో ట్యాబ్ రూ.35వేలు అవుతుందని.. ఇప్పుడంత ఖర్చా అని వ్యాఖ్యానించటంతో బాబుకు ఆగ్రహం కలిగించింది.

ప్రతి ఎమ్మెల్యేకు అసెంబ్లీలోనే ట్యాబ్‌.. ఐ ఫోన్ ఇస్తే.. వాటిని ఇంట్లో ఉంచి పిల్లలకు ఆడుకోవటానికి ఇచ్చారా? అంటూ బాబు ప్రశ్నించారు. ఉరకనే ఎమ్మెల్యేలు అయిపోతారా? ఆ మాత్రం ఖర్చు చేయలేరా? ట్యాబ్ లను వాడుకునే దానిపై అవగాహన తెచ్చుకోరా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో నేతలు ఎవరూ నోరు తెరిచే ధైర్యం చేయలేదని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల్ని డ్యాష్ బోర్డు సాయంతో ఎప్పటికిప్పుడు తెలుసుకునేలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రూ.35వేలకే వామ్మో.. అంత ఖర్చా అంటూ ఎమ్మెల్యే అన్న మాట పార్టీలో  ఇప్పుడు  అందరి నోట్లో నానుతుండటం గమనార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News