బాబు హెలికాఫ్టర్ శంషాబాద్ లో దిగిందెందుకు?

Update: 2016-07-18 16:39 GMT
ఎంతలో ఎంత మార్పు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలానే మాటలు చెప్పేవారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో విజయ ఢంకా మోగించిన తర్వాతే తాను హైదరాబాద్ ను వదిలిపెడతానన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడేమో బెజవాడను వదిలిపెట్టటానికి ఇష్టపడటం లేదు. గతంలో వీలైనంత ఎక్కువగా హైదరాబాద్ లోనే కాలక్షేపం చేసుకునేలా వ్యవహరించిన చంద్రబాబు.. బెజవాడకు వెళ్లేందుకు పెద్దగా మక్కువ ప్రదర్శించే వారు కాదు.

అలాంటి చంద్రబాబు ఇప్పుడు మారిపోవటమే కాదు.. బెజవాడను విడిచిపెట్టి.. హైదరాబాద్ కు వచ్చేందుకు సుతారం ఇష్టపడటం లేదు. తప్పదనుకుంటే తప్ప హైదరాబాద్ కు వచ్చేందుకు ఏ మాత్రం ఇష్టం ప్రదర్శించటం లేదు. విదేశాలకు వెళ్లాలన్నా.. హైదరాబాద్ నుంచి వెళ్లే వీలున్నా.. దాన్ని విడిచిపెట్టి.. హైదరాబాద్ వైపు చూసేందుకు సైతం ఇష్టపడనట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన బాబులో వచ్చిన కొత్త మార్పుగా చెప్పొచ్చు. అందుకే ఆయన.. శంషాబాద్ ను టచ్ చేయకుండా తన టూర్ ప్లాన్ ను సెట్ చేసుకుంటున్నారు. అలాంటి చంద్రబాబు తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి.. ఆ వెంటనే బెజవాడకు బయలుదేరి వెళ్లిన ఉదంతం సోమవారం చోటు చేసుకుంది.

సోమవారం కర్నూలు జిల్లాలో గోదావరి పుష్కరాల అంశం మీద రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఆయన.. తిరుగుముఖంలో బెజవాడకు వెళ్లాల్సి ఉంది. అయితే.. వాతావరణం సరిగా లేకపోవటంతో హెలికాఫ్టర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. అక్కడ నుంచి వెంటనే బెజవాడకు ఫ్లైట్ లో వెళ్లిపోయారు చంద్రబాబు. అదేందో ఎంత వద్దనుకున్నా.. శంషాబాద్ కు రాక తప్పని పరిస్థితి.
Tags:    

Similar News