జ‌క్క‌న్న‌కు మ‌రో బాధ్య‌త అప్ప‌గించిన బాబు

Update: 2017-10-26 05:16 GMT
ఎవ‌రు చేసే ప‌ని  వారు చేయాలి. ఏపీ ప్ర‌జ‌ల్ని పాలించే ప‌ని చంద్ర‌బాబుది అయితే.. సినిమాలు తీసే వృత్తి రాజ‌మౌళిది. అయితే.. దిగ్గ‌జ ద‌ర్శకుడి మేథ‌ను ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగించుకోవ‌టానికి స్వ‌యంగా ముఖ్య‌మంత్రే పిలిచి.. రాష్ట్ర రాజ‌ధాని నిర్మాణంలో ఐడియాలు ఇవ్వ‌మ‌ని కోర‌టం గౌర‌వ‌మే. కానీ.. ఆ పేరుతో ఎంత‌కూ తేల‌ని అమ‌రావ‌తి క‌ట్ట‌డాల బాధ్య‌త‌ను మీదే వేయ‌టం స‌రి కాదు.

తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. ఏపీ రాజ‌ధాని నిర్మాణ డిజైన్ల బాధ్య‌త‌ల్లో రాజ‌మౌళి మునిగిపోతున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. లండ‌న్‌ కు చెందిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ ప్ర‌తినిధులు త‌యారు చేసిన అమ‌రావ‌తిలో నిర్మించే వివిధ క‌ట్ట‌డాల ఆకృతులు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు న‌చ్చ‌క‌పోవ‌టం.. ఆయ‌న‌కు వెంట‌నే బాహుబ‌లి లాంటి అద్భుత చిత్రాన్ని తీసిన రాజ‌మౌళి గుర్తుకు వ‌చ్చారు.  ఈ చిత్రంలో క‌ళ్లు చెదిరిపోయేలా చూపించిన మ‌హిష్మ‌తి.. కుంత‌ల రాజ్యాల  డిజైన్లు బాబు మ‌న‌సును దోచుకొని ఉండాలి. అందుకే.. తాను నిర్మించే అమ‌రావ‌తి డిజైన్ల‌కు స‌ల‌హాలు ఇవ్వాలన్న బాధ్య‌త‌ను జ‌క్క‌న్న‌కు అప్ప‌జెప్పారు.

తాను తీసే సినిమాకు సంబంధించి.. అందులో ఏ ఫ్రేమ్ ఎలా ఉండాల‌న్న క్లారిటీ జ‌క్క‌న్న‌కు ఉంటుంది. నిర్మాత పెట్టే పెట్టుబ‌డి.. ప్రేక్ష‌కుల‌కు అంతిమంగా ఏం అందించాల‌న్న విష‌యం ద‌ర్శ‌కుడిగా జ‌క్క‌న్న మాట మీదే న‌డుస్తుంది. కానీ.. ఏపీ రాజ‌ధాని నిర్మాణాల విష‌యం మొత్తం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇష్టం చుట్టూనే న‌డుస్తుంది. అలాంట‌ప్పుడు త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇష్టాయిష్టాల కంటే కూడా బాబు ఇష్టాలు.. అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా రాజ‌మౌళి ఆలోచించాల్సి ఉంటుంది.

తాను క‌ల‌లు క‌న్న దానిని తెర మీద ఆవిష్కరించే బాధ్య‌త నుంచి.. మ‌రొక‌రి క‌లను ఆవిష్క‌రించే బ‌రువును త‌న మీద వేసుకునేందుకు ఓకే అన్న జ‌క్క‌న్న.. ఆ బాధ్య‌త‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారా? అన్న‌ది సందేహం. ఎందుకంటే.. తొలుత డిజైన్ల మార్పుల‌కు సంబంధించి సూచ‌న‌లు చేయాల‌ని తొలుత చెప్పిన చంద్ర‌బాబు.. తాజాగా మ‌రో భారీ బాధ్య‌త‌ను మీదేశారు.

లండ‌న్ లో నార్మ‌న్ ఫోస్ట‌ర్ ప్ర‌తినిధుల్ని క‌లిసిన సంద‌ర్భంగా అమ‌రావ‌తి నిర్మాణాల‌కు సంబంధించి మ‌రో బాధ్య‌త‌ను రాజ‌మౌళి మీద పెట్టేశారు చంద్ర‌బాబు. హైకోర్టు న‌మూనాకు కొన్ని మార్పుల‌తో ఓకే చెప్పిన బాబు అసెంబ్లీ.. స‌చివాల‌య భ‌వ‌న ఆకృతుల విష‌యంలో మ‌రింత క‌స‌ర‌త్తు అవ‌స‌ర‌మ‌ని నార్మ‌న్ ఫోస్ట‌ర్ ప్ర‌తినిధుల‌కు చెప్పారు. అదే స‌మ‌యంలో  అమ‌రావ‌తిలో నిర్మించే భ‌వ‌నాల‌కు సంబంధించిన డిజైన్ల విష‌యంలో రాజ‌ధాని క‌మిటీ సూచ‌న‌ల్ని.. ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌య్యే అభిప్రాయాల్ని నార్మ‌న్ ఫోస్ట‌ర్ కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయాల‌న్న భారీ బాధ్య‌త‌ను జ‌క్క‌న్న‌కు అప్ప‌జెప్పారు

అంటే.. డిజైన్ల విష‌యంలో జ‌క్క‌న్న బాధ్య‌త ప‌రిధి ఇప్పుడు మ‌రింత పెరిగింద‌న్న మాట‌. తొలుత డిజైన్ల‌కు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వాల‌న్న స్థానే.. ఇప్పుడు ప్ర‌జ‌ల అభిప్రాయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్య‌త కూడా మీద ప‌డిందని చెప్పాలి. అంటే.. సినిమాలు తీసుకోవాల్సిన జ‌క్క‌న్న‌కు ఇప్పుడు రాజ‌ధాని నిర్మాణాల డిజైన్ల విష‌యంలో అటు ప్ర‌భుత్వానికి.. ఇటు ప్ర‌జ‌ల‌కు అనుసంధాన క‌ర్త‌గా ఉండి.. డిజైన్లు రూపొందించే నార్మ‌న్ ఫోస్ట‌ర్‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించాల‌న్న మాట‌. మొత్తంగా చూస్తే.. ఏపీ రాజ‌ధాని నిర్మాణ బాధ్య‌త‌ల్లో జ‌క్క‌న్న అంత‌కంత‌కూ కూరుకుపోతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  
Tags:    

Similar News