బాబు మాంచి రైజింగ్‌లో ఉన్నారా..?

Update: 2015-07-07 09:39 GMT
మొన్నటి వరకూ ఓటుకు నోటు కేసుకు సంబంధించి వ్యవహారం.. ఆపై బయటకు వచ్చిన ఆడియో టేపులతో విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయనపై పలువురు జోకులు వేయటంతో పాటు.. ఆయన పని అయిపోయిందన్న వాదనలు చేశారు.

మరికొందరు అత్యుత్సాహవంతులైతే.. త్వరలో చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని.. ఆయన స్థానంలో బాలకృష్ణ ముఖ్యమంత్రి అని ఒకరు.. కాదు.. కాదు యనమల అని మరొకరు అంటే.. కొన్ని ఇంగ్లిషు మ్యాగ్‌జైన్లు అయితే.. వీరందరికి భిన్నంగా కేంద్రమంత్రి.. టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు సీఎంను చేసి బాబు పక్కన కూర్చుంటారని అంచనాలు వేశారు.

నాలుగు రోజులు ఎక్కడికి కదలకుండా కూర్చున్న చంద్రబాబు.. మీటింగ్‌ల మీద మీటింగ్‌ నిర్వహించి.. మొత్తంగా ఒక ప్లాన్‌ సెట్‌ చేయటంతో పాటు.. తనకున్న శక్తియుక్తుల్ని.. పరపతిని ఉపయోగించి.. మొత్తంగా ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొచ్చారని చెబుతారు. ఓటుకు నోటు సంగతి తర్వాత.. దానికి మించి తెలంగాణ రాష్ట్ర సర్కారుకు షాక్‌ కొట్టేలా ట్యాపింగ్‌ వ్యవహారంతో పాటు.. సెక్షన్‌ 8 అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

పూర్తిగా ప్రతికూల పరిస్థితి నుంచి.. ధీమాగా ఉండే పరిస్థితికి వెళ్లిన చంద్రబాబుకు గడిచిన రెండు రోజులుగా తీపి కబుర్లు అందుతున్నాయి. ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఆయనకు అన్నీ మంచి శకునాలే ఎదురుకావటం గమనార్హం.

తెలంగాణలో పార్టీ పని అయిపోయిందన్న భావనను వ్యక్తం చేస్తూ.. తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారపక్షానికి షాక్‌ ఇచ్చేలా ఉప ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలలో.. మూడు చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించటం విశేషంగా మారింది. మహబూబ్‌నగర్‌.. వరంగల్‌.. ఖమ్మం జిల్లాలకు చెందిన మూడు ఎంపీటీసీ సీట్లు టీడీపీ నేతలు గెలుచుకున్నారు. ఈ గెలుపుతో తెలుగు తమ్ముళ్లు పండగ చేసుకునే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రోజు గడిచే సరికి తాజాగా వెలువడిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ అధికారపక్షం అద్భుత విజయాన్ని సాధించటం గమనార్హం. పార్టీకి పెద్దగా బలం లేదని భావించే కర్నూలు.. ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో.. ప్రకాశం జిల్లాలో అద్భుతమైన మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలిస్తే.. కర్నూలులో సైతం గౌరవప్రదమైన మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. తాజా పరిస్థితుల్లో ఒక్క సండ్ర అరెస్ట్‌ ఇష్యూ తప్పిస్తే.. మొత్తంగా బాబు మాంచి రైజింగ్‌లోఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. సండ్ర అరెస్ట్‌ ఊహించిందే కాబట్టి.. ఎవరికి ఎలాంటి షాక్‌లు లేవన్న అభిప్రాయాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News