లంకలో చంద్రబాబుకి అరుదైన గౌరవం!

Update: 2016-12-23 08:15 GMT
అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అధ్య‌యనం చేయ‌డం కోసం ముఖ్య‌మంత్రులు విదేశాల‌కు వెళ్లిరావ‌డం అనేది స‌ర్వసాధార‌ణ విష‌యం.  కానీ, మ‌న రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న అభివృద్ధిని ఇత‌ర దేశాలు గుర్తించ‌డం అనేది అరుదైన సంద‌ర్భం. మ‌న సీఎంల‌ను ఇత‌ర దేశాలు ఆహ్వానించ‌డం అనేది విశేషంగానే చెప్పుకోవాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి అలాంటి అరుదైన ఆహ్వాన‌మే శ్రీ‌లంక నుంచి వ‌చ్చింది.

శ్రీ‌లంక అధ్య‌క్షుడు మైత్రిపాల శిరిసేన నుంచి చంద్ర‌బాబు నాయుడుకి ఒక ఆహ్వానం అందింది. ఈ మేర‌కు లంక అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు ఒక లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి శిరిసేన మెచ్చుకున్నారు. పేద‌రిక నిర్మూల‌న కోసం చంద్ర‌బాబు స‌ర్కారు చేప‌డుతున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు బాగున్నాయ‌న్నారు. వీటితోపాటు గ్రామాల అభివృద్ధి కోసం సీఎం చేస్తున్న కృషిని కొనియాడారు. ఫుడ్ ప్రాసెసింగ్, పింఛెన్లు వంటి ప‌థ‌కాల అమ‌లు ఆంధ్రాలో అద్భుతంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

శ్రీ‌లంక అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు పూర్తి అవుతున్న సంద‌ర్భంగా త‌మ దేశంలో జ‌రిగే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు సాద‌రంగా ఆహ్వానించారు. అంతేకాదు, ఈ ఉత్స‌వాల్లో త‌మ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా  ప్ర‌సంగించాల‌ని కోరారు.

శ్రీ‌లంక నుంచి చంద్ర‌బాబుకు ఈ ఆహ్వానం రావ‌డం అరుదైన గుర్తింపుగా తెలుగుదేశం శ్రేణులు చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని విదేశాలు సైతం గుర్తిస్తున్నాయంటూ దేశం నేత‌లు అంటున్నారు. ఆంధ్రాలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌న్నింటినీ విదేశాలు ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి, గ‌తంలో శ్రీ‌లంక‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా వెళ్లొచ్చారు. తెలంగాణలో జ‌రుగుతున్న అభివృద్ధి గురించి అక్క‌డ వివ‌రించారు. ఇప్పుడు ఏపీకి ఆ అవ‌కాశం వ‌చ్చింద‌ని అనుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News