రాష్ట్రాల మధ్య వివాదం చేస్తున్న చంద్రబాబు!

Update: 2015-06-09 17:30 GMT
రాష్ట్ర విభజనకు కేంద్రం ఆమోదం తెలిపిన మొదటిరోజు నుంచీ తెలంగాణతోపాటు సీమాంధ్రలోనూ సెంటిమెంట్లు రగులుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అవి ఉపశమించకపోగా మరింత పెరిగాయి. ఇప్పుడు కూడా నవ్యాంధ్రలో సెంటిమెంటు బలంగానే ఉంది. దీనినే తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

వాస్తవానికి, రేవంత్‌ రెడ్డిపై స్టింగ్‌ ఆపరేషన్‌ కానీ, హైదరాబాద్‌లో చంద్రబాబు ఫోన్లను ట్యాపింగ్‌ చేయడంతో కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివాదం కూడా కాదు. ఇంకా చెప్పాలంటే రెండు పార్టీలైన టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య వివాదం ఇది. చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య వివాదం ఇది. కానీ, కేసీఆర్‌ తరహాలోనే ఈ వివాదం నుంచి సాధ్యమైనంత సెంటిమెంటును పిండుకోవాలని చంద్రబాబు కూడా పావులు కదుపుతున్నారు. అందుకే ఈ వివాదాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా మార్చడానికి కసరత్తు చేస్తున్నారు. గుంటూరులో మహా సంకల్ప సభలో ఆయన వ్యాఖ్యలు కూడా దీనినే సూచిస్తున్నాయి.

ఇప్పుడు తాను ఒక వ్యక్తిని కానని, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రినని, తన ఫోన్‌ను ఎలా ట్యాప్‌ చేస్తారని ప్రశ్నించారు. తనను అవమానిస్తే ఐదు కోట్ల మందిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. అక్కడితోఊరుకోకుండా, అవునా కాదా అని సభకు వచ్చిన వారిని అడిగారు. వారితో చప్పట్లు కొట్టించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులను కేసీఆర్‌ కొడుతున్నాడని, ఇళ్లు కూల్చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ వివాదంతో చిక్కుల్లో కూరుకుపోయిన చంద్రబాబు.. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే ప్రజా మద్దతు తప్పనిసరి అని భావిస్తున్నారని, అందుకే ఆయన తరహాలో సెంటిమెంటును రంగరించడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News