ఆమంచి ఇష్యూలో బాబు త‌ప్పులు చాలానే ఉన్నాయ‌ట‌!

Update: 2019-02-14 14:30 GMT
త‌న‌కు తోచింది చేయ‌టం.. ఎదుటోడు ఎవ‌డైనా.. ఎలాంటోడైనా.. వారిని ప‌ట్టించుకోక‌పోవ‌టం.. త‌న‌దైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ లెక్క వేరుగా ఉంటుంద‌ని చెబుతారు. మాజీ ముఖ్య‌మంత్రి క‌మ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన కొణిజేటి రోశ‌య్య‌కు శిష్యుడుగా చెప్పే ఆయ‌న తీరు మొద‌ట్నించి ఆస‌క్తిక‌ర‌మే. రోశ‌య్య లాంటి సాఫ్ట్‌.. జెంటిల్ మెన్ కు శిష్యుడిగా తెర.. ఆయ‌న నేతృత్వం వ‌హించిన చీరాల‌కు త‌న త‌దుప‌రి పోటీదారుగా డిసైడ్ చేసిన ఆమంచి కాస్త భిన్న‌మైన వ్య‌క్తిగా పేరుంది.

వివాదాస్ప‌ద అంశాల్లో ఆయ‌న పేరు వినిపిస్తూ ఉంటుంది. అదే స‌మ‌యంలో చీరాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్ని ఆయ‌న్ను నెత్తిన పెట్టుకోవ‌టం క‌నిపిస్తుంది. కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. 2014 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన అతి కొద్దిమందిలో ఆమంచి ఒక‌రు. బాబు పార్టీలో మూడున్న‌రేళ్ల పాటు ఉన్న ఆయ‌న‌.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌టం.. పార్టీలో చేర‌నున్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే.

ఇప్ప‌టికిప్పుడు బాబు పార్టీని వ‌దిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్న‌ట్లు?  తెర వెనుక ఏం జ‌రిగింది?  అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సింఫుల్ గా లేఖ రాసేసి.. పార్టీకి రాజీనామా చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించిన ఆమంచి.. జ‌గ‌న్ ను క‌లిసిన త‌ర్వాత మాత్రం త‌న స్వ‌రాన్ని తీవ్ర‌త‌రం చేశారు. బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ ఆయ‌న సైకిల్ దిగాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చిన‌ట్లు?  కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. పోల్ మేనేజ్ మెంట్ విష‌యంలో మాంచి పేరున్న ఆమంచి బాబు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. తాను పార్టీ మార‌టానికి కార‌ణాల్ని ఆయ‌న స్టైల్లో చెప్పుకొచ్చారు. అయితే.. తెర వెనుక అంశాల్ని త‌వ్వి చూస్తే.. ఆమంచి పార్టీకి గుడ్ బై చెప్ప‌టానికి టీడీపీ నేత‌ల త‌ప్పుల చిట్టా ఉంద‌ని చెప్పాలి.

ఆమంచి ఆత్మాభిమానం దెబ్బ తినేలా బాబు వ‌రుస పెట్టి నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఆయ‌న్ను బాగా క‌లిచి వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ఆయ‌న ఇగో దెబ్బ తినేలా చోటు చేసుకున్న ప‌రిణామాలు కూడా జ‌గ‌న్ పార్టీ వైపు అడుగులు వేసేలా చేశాయ‌ని చెప్పాలి. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీత‌కు తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలి పోస్టు ఇవ్వ‌టం.. దానికి సంబంధించిన స‌మాచారం త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌టం  ఒక‌టైతే.. సునీత‌కు గ‌తంలో ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇవ్వ‌టం ఆయ‌న కోపానికి కార‌ణంగా చెబుతున్నారు.

ఈ రెండు అంశాలే కాదు.. స్థానికంగా ఉండే టీడీపీ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రిగా సుప‌రిచితులు పాలేటి రామారావు..  ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో న‌డిచే మ‌రో ఎంపీపీ ప‌లువురు నేత‌లు త‌న‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న ప్ర‌చారానికి బ్రేకులు వేయ‌టంలో బాబు ఫెయిల్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఎదుర‌వుతున్న అవ‌మానాల్ని త‌ట్టుకోవ‌టం క‌ష్టంగా మార‌టం.. పార్టీలో కొన‌సాగ‌టం ఇష్టం లేక‌నే ఆయ‌న విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోన్ పార్టీలోకి జాయిన్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా టీడీపీలో బ‌ల‌మైన నేత‌లంతా విప‌క్ష పార్టీ వెంట న‌డ‌వ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News