మొత్తానికి చంద్రబాబు స్థలాన్ని అమ్మేశారు

Update: 2017-01-29 07:25 GMT
శ్రీకాకుళం పట్టణంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరిట ఉన్న  దాదాపు అర ఎకరా స్థలం విక్రయంలో చంద్రబాబు చివరకు మంత్రి అచ్చెన్నాయుడినే ఆశ్రరయించాల్సి వచ్చింది. ఆ జిల్లా నేతలు ఎవరికి వారు తాము చెప్పినట్లే చేసి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయాలని ట్రయ్ చేసి అసలు ఆ స్థలాన్ని విక్రయించలేక చేతులెత్తేశారు. చివరకు అచ్చెన్నాయుడు రీఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు పని పూర్తయింది. అచ్చెన్నాయుడు మొదలుపెట్టి చివరకు అచ్చెన్నాయుడే ఫినిష్ చేసిన ఈ డీల్ వెనుక నడిచిన రాజకీయం అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంది..

శ్రీకాకుళంలోని బలగ ప్రాంతంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు  సర్వే నెం.18/6,7,8లో 45.5 సెంట్లు స్థలం ఉంది. 2002లో దీన్ని పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కొన్నారు.  అక్కడ భూమి పూజ చేసినా నిర్మాణం జరగలేదు. అయితే.. ఈలోగా పట్టణంలో కలెక్టరు ఆఫీసుకు 80 అడుగుల రోడ్డు ఒకటి కొత్తగా వేయడంతో ఆ ప్రాంతమంతా విశాలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందుతోంది.. ప్రభుత్వ కార్యాలయాలూ అటువైపే నిర్మితమవుతున్నాయి. దీంతో అక్కడ టీడీపీ కార్యాలయం(ఎన్టీఆర్ ట్రస్టు భవన్) నిర్మించాలని భావించారు. ఇప్పుడున్న స్థలాన్ని అమ్మేసి కొత్తగా 80 ఫీట్ రోడ్లో నిర్మించాలన్నది ప్లాన్.  కానీ.. శ్రీకాకుళంలో మంచి ధరలు, గిరాకీ ఉన్నా కూడా చంద్రబాబు స్థలం కొనుగోలుకు మాత్రం ఎందుకో ఎవరూ ముందుకు రాలేదు.  దీంతో దాన్ని ఎవరికైనా అంటగట్టాలని నేతలంతా చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  చివరికి రెడ్డి చిరంజీవి అనే వ్యక్తికి రూ.1.70 కోట్లకు విక్రయించారు.

నిజానికి ఈ భూమి విక్రయంపై చాలాకాలంగా పార్టీ నేతల మధ్య రాజకీయం నడిచింది.  దీన్ని విక్రయించాలని చంద్రబాబు, లోకేశ్ ల నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత తొలుత గత ఏడాది జూన్ 29న దాన్ని రూ.1.55 కోట్లకు విక్రయించేందుకు అచ్చెన్న నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని జిల్లా పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో ప్రతిపాదించగా దాదాపుగా అందరూ ఆమోదించారు. కానీ.. ప్రభుత్వ విప్ కూన రవికుమార్, సీనియర్ ఎమ్మెల్యే శివాజీలు అభ్యంతరం చెబుతూ వేలం వేస్తే రూ.2 కోట్లకు పైగా వస్తుందన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా మంత్రి అచ్చెన్న మాట చెల్లుబాటు కాకుండా చేసేందుకు వేలం ప్రక్రియకే మద్దతు పలికారు. ఈ మేరకు లోకేశ్ తో మాట్లాడి ఆదేశాలు ఇప్పించారు.

మధ్యంతరంగా  ఆ స్థలానికి పవర్ ఆఫ్ అటార్నీని జడ్పీ చైర్ పర్సన్ ధనలక్ష్మికి ఇచ్చి విక్రయం జరపాలని చంద్రబాబు సూచించారు. కానీ.. ఆమె భర్త ఇదే సాకుగా ఈ భూమి విక్రయంలో రూ.25 లక్షలు కొట్టేసే ప్లాన్ చేశారని ఆరోపణలు రావడంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఆమె తండ్రి శివాజీలు చంద్రబాబును కలిసి పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేయించారు.

ఆ తరువాత 2016 సెప్టెంబరులో ఆ స్థలం బహిరంగ వేలానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శిరిషా సీల్డు టెండర్లు ఆహ్వానించారు. పార్టీ ధర రూ.1.60 కోట్లుగా నిర్ణయించారు. 1.61 కోట్ల రూపాయలకు పలాసకు చెందిన డికె నాయుడు అనే వ్యాపారి కోడ్ చేశారు.  కానీ.. వేలం రోజున ఎవరూ రాలేదు. దీంతో స్థలం అమ్మకం ఆగిపోయింది. అచ్చెన్న మాటను కాదని ప్రభుత్వ విప్, పార్టీ అధ్యక్షురాలు.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏదో చేసేద్దామని ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు.

దీంతో మళ్లీ లోకేశ్ ఇదంతా జరిగే పని కాదని గుర్తించి దాన్ని అమ్మే బాధ్యత పూర్తిగా అచ్చెన్నకు అప్పగించారు. దీంతో అచ్చెన్నే రంగంలోకి దిగాల్సి వచ్చింది. గతంలో ఆ స్థలాన్ని కొనేందుకు వచ్చిన  రెడ్డి చిరంజీవితో ఇటీవల అచ్చెన్న, రామ్మోహన్ నాయుడులు భేటీ అయి  రూ.కోటీ 70 లక్షలకు కొనేలా ఒప్పించారు.
Tags:    

Similar News