విషాద వేళ‌.. స‌ద‌స్సులు ఏంది చంద్ర‌బాబు?

Update: 2018-08-08 07:30 GMT
ప‌క్కింట్లో పుట్టెడు శోకం చోటు చేసుకుంటే.. త‌మ దారిన తాము పోవ‌టం ఎక్క‌డైనా ఉంటుందా?  ఇలాంటి విప‌రీతాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ద్ర‌విడ సూరీడుగా.. త‌మిళ రాజ‌కీయ మేరున‌గం లాంటి క‌రుణ మ‌ర‌ణం నేప‌థ్యంలో త‌మిళ‌నాడుతో పాటు.. దాని ప‌క్క‌నే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతూ ఉంది.

అవున‌న్నా.. కాద‌న్నా.. క‌రుణ తెలుగోడే. ఆ విష‌యం ఇప్ప‌టికే అంద‌రికి తెలిసిందే. తెలుగు మూలాలున్న ద‌క్షిణామూర్తి అలియాస్ క‌రుణానిధి మ‌ర‌ణం క‌చ్ఛితంగా తెలుగు ప్ర‌జ‌ల‌కు వేద‌న క‌లిగించేదే. దీనికి తోడు.. రెండు తెలుగురాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు తెలుగువాళ్లు (వారిలో ఎక్కువ మంది ఆంధ్రా రాష్ట్రానికే చెందిన వారు) త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

త‌మిళ‌నాడుతోనూ.. అక్క‌డి ప్ర‌జ‌ల‌తోనూ ఇంత‌టి అనుబంధం ఉన్న వేళ‌.. ఆ రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ నేత మ‌ర‌ణించిన‌ప్పుడు.. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్ని వాయిదా వేస్తే త‌ప్పేం అవ్వ‌దు. ప‌క్క రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖుడు క‌న్నుమూసిన విషాద వేళ‌లో.. ప్ర‌భుత్వం చేప‌ట్టే ముఖ్య‌మైన కార్య‌క‌లాపాల్ని వాయిదా వేయ‌టం బాగుంటుంది.

తెలంగాణ‌లోని హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఒక ఫ్లైఓవ‌ర్ ప్రారంభం ఈ రోజు (బుధ‌వారం ఉద‌యం) ఉంది. కానీ.. క‌రుణ మ‌ర‌ణం నేప‌థ్యంలో దాని ప్రారంభోత్స‌వాన్ని వాయిదా వేశారు.

కానీ.. ఇందుకు భిన్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం మంగ‌ళ‌గిరి సీకే క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో గ్రామ‌ద‌ర్శిని నోడ‌ల్ అధికారుల రాష్ట్ర స్థాయి స‌ద‌స్సును ఏర్పాటు చేశారు. ఇలాంటి స‌ద‌స్సులు ఇవాళ కాకున్నా త‌ర్వాత ఏర్పాటు చేసినా కొంప‌లు మున‌గ‌వు. నిజానికి క‌రుణ మ‌ర‌ణ‌వార్త నిన్న సాయంత్రం ఏడు గంట‌ల ప్రాంతానికి అంద‌రికి చేరిపోయింది. అలాంట‌ప్పుడు యుద్ధ ప్రాతిప‌దిక‌న కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసిన‌ట్లుగా ప్ర‌క‌టిస్తే ఎంత గౌర‌వంగా ఉంటుంది.

ప‌క్కింట్లో పుట్టెడు శోకంతో ఊగిపోతున్న వేళ‌.. వెయ్యి మంది అధికారుల‌తో భారీ స‌ద‌స్సును ఏర్పాటు చేయ‌టం చూస్తే.. సీనియ‌ర్ నాయ‌కుడిగా త‌న‌ను తాను చెప్పుకునే చంద్ర‌బాబులో రాజ‌కీయ ప‌రిణితి ఇంతేనా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.


Tags:    

Similar News