బాబుపై ఒత్తిడి...చీఫ్ జ‌స్టిస్‌ కు లేఖ‌

Update: 2018-01-03 17:54 GMT
ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌పై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు అన్నివైపులా వ‌చ్చిన ఒత్తిడితో కీల‌క ముంద‌డుగు వేసిన‌ట్లు స‌మాచారం. ఆంధ్రలో ప్రత్యేక హైకోర్టు నెలకొల్పేందుకు సమ్మతిస్తూ హైకోర్టుకు ఆ రాష్ట్ర సర్కారు ఒక లేఖ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు అవ‌స‌ర‌మైన భ‌వ‌నాలు స‌మ‌కూరుస్తామ‌ని చంద్రబాబు తెలిపారు. సీజే నుంచి కేంద్రానికి నివేదిక వెళ్ల‌గానే రాష్ట్రప‌తి గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేస్తే అమ‌రావ‌తికి హైకోర్టు త‌ర‌లిరానుంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌ లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాల‌ ఉమ్మ‌డి న్యాయస్థానంగా పనిచేస్తోంది. విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు కావ‌స్తుండ‌టంతో హైకోర్టును కూడా విభ‌జించాల‌ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే ఏపీ స‌ర్కారు భూములు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే జాప్యం జ‌రుగుతోంద‌ని టీఆర్ ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. నవ్యాంధ్రలో భవనాల కొరత కారణంగా ఆలస్యం జరుగుతూ వచ్చిందని ఏపీ స‌ర్కారు చెప్తోంది. ఇటీవ‌లే పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భ‌వ‌నాల‌ను సిద్దం చేస్తున్న‌ట్లు జస్టిస్‌ ర‌మేష్ రంగ‌నాధ‌న్‌కు రాసిన లేఖలో సీఎం తెలిపారు. విజ‌య‌వాడ‌ - అమ‌రావ‌తి ప‌రిధిలో మూడు భ‌వ‌నాలు చూసిన‌ట్లు స‌మాచారం. వాటి ప‌రిశీల‌న‌కు న్యాయ‌మూర్తుల క‌మిటీ వేయాల‌ని కోరారు. భ‌వనాల ప‌రిశీల‌న‌కు ప‌ది రోజుల్లో రావాల‌ని సీఎం కోరారు. మార్పులు చేర్పులు సూచిస్తే నెల‌రోజుల్లో పూర్తి చేసి సిద్దం చేస్తామ‌ని సీజేకు రాసిన లేఖ‌లో చంద్రబాబు తెలిపారు.

జూన్ రెండు నాటికి అమ‌రావ‌తికి హైకోర్టు త‌ర‌లివ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఈ లేఖ‌లో సూచించారు. నవ్యాంధ్రలో భ‌వ‌నాల ఎంపిక పూర్త‌యితే కేంద్రానికి రాష్ట్రం ప్ర‌తిపాద‌న‌లు పంపాల్సి ఉంటుంది. వాటిపై కేంద్ర న్యాయ‌శాఖ చ‌ర్చించి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సూచ‌న‌లు తీసుకోనుంది. ఆ తర్వాత ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తున్న‌ట్లు రాష్ట్రప‌తికి నివేదిక ఇవ్వాలి. ఆయన అంగీకారం తెలిపి గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తే హైకోర్టు ఏర్ప‌డిన‌ట్లు అవుతుంది. ఈ ప్ర‌క్రియను త్వ‌ర‌గా ముగించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. హైకోర్టు విభ‌జ‌న‌తో అమ‌రావ‌తికి త‌ర‌లివ‌చ్చే న్యాయ‌మూర్తులు - ఇత‌ర సిబ్బందికి వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పైనా దృష్టి పెట్టింది. సీఆర్డీఏ అధికారుల‌కు సైతం ఆదేశాలు వెళ్లాయి.

కాగా, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఉమ్మ‌డి హైకోర్టులో న్యాయ‌మూర్తుల‌ను ఏపీ - తెలంగాణ‌కు  కేంద్రం విభ‌జించింది. అమ‌రావ‌తిలో హైకోర్టు ఏర్పాట‌యితే ఏపీకి సంబంధించి అన్ని కార్యాల‌యాలు హైద‌రాబాద్ నుంచి త‌ర‌లివ‌చ్చిన‌ట్ల‌వుతుంది. హైద‌రాబాద్‌ లోని ప్రస్తుత హైకోర్టు తెలంగాణ‌కు చెందుతుంది.
Tags:    

Similar News