జగన్ కు బాబు లేఖ.. కరోనా వేళ ఎంత మార్పో?

Update: 2020-03-23 16:00 GMT
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - టీడీపీ అధినేత - ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడుల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో జగన్ కు చంద్రబాబు లేఖ రాయడం - పలు సలహాలు - సూచనలు చేయడం ఊహించగలమా? మామూలుగా అయితే ఈ తరహా పరిస్థితిని ఊహించలేం గానీ.. ప్రాణాంతక వైరస్ కోవిడ్- 19 ఆ దిశగా ఊహించేలా చేసింది. చంద్రబాబుతో ఏకంగా జగన్ కు లేఖ రాసేలానే కాకుండా పలు సలహాలు - సూచనలు చేసేలా చేసింది.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ పరిణామం సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏపీ విపక్ష నేత హోదాలో చంద్రబాబు.. సీఎం హోదాలో ఉన్న జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించకుండా చంద్రబాబు... జగన్ కు పలు సలహాలు - సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే జగన్ కు చంద్రబాబు ఈ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు అందరినీ అమితాశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పాలి. ఈ తరహా సుహృద్భావ వాతావరణం ఇకపైనా చంద్రబాబు - జగన్ ల మధ్య కొనసాగాలన్న వాదన కూడా వినిపిస్తోంది.

అయినా ఈ లేఖలో జగన్ కు చంద్రబాబు ఏఏ సలహాలు - సూచనలు ఇచ్చారన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జగన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయేవారికి అండగా నిలవాలని కూడా చంద్రబాబు కోరారు. రెండు నెలలకు సరిపడా రేషన్ ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి కుటుంబానికి రూ.5 వేల ఆర్థికసాయం అందించాలని సూచించారు. కూరగాయల ధరలు పెరగకుండా చూడాలని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే ఓ నెల రేషన్ ను - ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి రూ.1,000ని జగన్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News